చంద్రబాబు చాణక్యం!
Publish Date:Mar 8, 2025
Advertisement
గోదావరి జలాలపై ఏపీ సీఎం సంచలన ప్రకటనతో బీఆర్ఎస్ గప్ చుప్! పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీలో ఎంత చర్చ జరుగుతోందో ఏమో కానీ.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో కట్టబోతోన్న ఇరిగేషన్ ప్రాజక్టు మీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడానికి కారణం చంద్రబాబు చేసిన కామెంట్లే. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు చేద్దామనుకున్న సెంటిమెంట్ రాజకీయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మొగ్గలోనే తుంచేశారు. తెలంగాణలో ఉన్న రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పినా.. అది మరింత ముదరకుండా చంద్రబాబు తన కామెంట్లతో కామ్ చేసేశారనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో భగ్గున మండుతుందనుకున్న సెంటిమెంట్ రాజకీయ మంటలు రేగకుండా చప్పున చల్లారేలా చంద్రబాబు చేశారనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్సులో జరుగుతున్న చర్చ. ఒక్క టీఎంసీ నీటి కోసం.. రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు.. ఆందోళనలు.. పోలీసుల మొహరింపు వంటి సంఘటనలు చోటు చేసుకున్న రోజులున్నాయి. అలాంటింది, ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన కామెంట్ ఆయనలోని రాజకీయ పరిపక్వతకు, దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా చేసుకోవడంతో పాటు తెలంగాణలో కూడా ఎలాంటి సెంటిమెంట్ రాజుకోకుండా చూడడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నా.. తామేం అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా తెలంగాణ నీటి అవసరాల కోసం కావాలనుకుంటే మరిన్ని ప్రాజెక్టులు గోదావరి నదిపై కట్టుకోవచ్చంటూ బంపరాఫర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. సహజంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ తరహా కామెంట్లు చేయడం దాదాపు ఉండదు. మరీ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు.. నదీ జలాల విషయంలో సీఎం స్థాయి వ్యక్తులు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తారు. కానీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమని చెబుతూనే.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. ఈ విధంగా ఏపీకి అతి ముఖ్యమైన ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే భావన తెలంగాణ సర్కిల్సులో వ్యక్తమవుతోంది. పైగా తాము నికర జలాలను వాడుకోవడం లేదని.. వరద జలాలను మాత్రమే తరలిస్తామని చెప్పడం ద్వారా సాంకేతిక పరమైన అడ్డంకులు లేకుండా చూసుకున్నారు చంద్రబాబు. గోదావరి జలాల గురించి చంద్రబాబు అంత విశాల హృదయంతో స్పందిస్తారని తామెవ్వరంఊహించలేకపోయామనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా జరుగుతోందట. చంద్రబాబు చాణక్యంతో తాము చేద్దామనుకున్న రాజకీయానికి చెక్ చెప్పేశారని బీఆర్ఎస్ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. గతంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని తాము ఎద్దేవా చేశామనీ, ఇప్పుడూ చంద్రబాబు అదే సిద్దాంతాన్ని చెప్పడం ద్వారా తమ ప్రణాళికలు చెక్ పెట్టేశారన్న ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు ప్రైవేటు సంభాషణల్లో బీఆర్ఎస్ నేతల నుంచే వస్తున్నాయి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునేందుకు తాము ఏపీ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే.. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవడానికి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన కామెంట్లతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం కుదరడం లేదంటూ నిట్టూరుస్తున్నారట బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఆసక్తికర చర్చ
http://www.teluguone.com/news/content/cbn-check-brs-sentiment-politics-25-194100.html





