చంద్రబాబు దీక్షతో కాంగ్రెస్ దిగి వస్తుందా
Publish Date:Oct 6, 2013
Advertisement
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అనుచిత వైఖరిని నిరసిస్తూ రేపటి నుండి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాల తెదేపా నేతలు కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. తద్వారా ఆయన దీక్ష తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేఖం కాదనే సంకేతం ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచన కావచ్చును. కానీ, తద్విరుద్ధంగా రాష్ట్రంలో ప్రచారం జరగుతోంది. ఆయన తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకోవడానికే దీక్ష చేస్తున్నారని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఆరోపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి “ఆయన చేసే దీక్ష సమైక్యాంధ్ర కోసమేనని” విస్పష్టంగా ప్రకటిస్తే తమ పార్టీ కూడా ఆయన దీక్షకు మద్దతు ఇస్తుందని ప్రకటించి సీమంద్రా ప్రజలలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేసారు. అందువల్ల ఆయన దీక్ష పట్ల రెండు ప్రాంతాల ప్రజలలో ఆశించిన విధంగా ప్రతిస్పందన కలుగలేదు. చంద్రబాబు తన దీక్షతో రాష్ట్రంలో ఆశించిన విధంగా ఫలితం దక్కించుకోలేకపోయినా, ఈ సమస్యను జాతీయ నేతల, జాతీయ మీడియా దృష్టికి సమర్ధంగా తీసుకు వెళ్ళగలరు. రాష్ట్ర విభజన ద్వారా రెండు ప్రాంతలలో తన పార్టీని దారుణంగా దెబ్బతీయాలని చూస్తున్నకాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుటిలోపాయలను ఆయన బయటపెట్టవచ్చును. అందుకోసం జగన్మోహన్ రెడ్డిని లోపాయకారిగా ఉపయోగించుకొనేందుకు సీబీఐని ఏవిధంగా నిర్వీర్యం చేసినది కూడా ఆయన తన దీక్షలో బయటపెట్టవచ్చును. ఇప్పటికే, నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి సీబీఐకి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని చెపుతున్న మాటలు ప్రజల హృదయాలలో బలంగా నాటుకొంటున్నాయి. ఇప్పుడు చంద్రబాబు క్లూడా ఇదే విషయం జాతీయ మీడియాకు వివరించడం మొదలుపెడితే, అది త్వరలో డిల్లీతో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోబోతున్న కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా డిల్లీ ఎన్నికలలో దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చాలా ఉండవచ్చును. రాష్ట్రంలో తన పార్టీని దెబ్బతీయ జూస్తున్న కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు ఈవిధంగా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు. కానీ చంద్రబాబు దీక్షతో కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. తెదేపా, వైకాపా రెండూ కూడా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చాయని, అటువంటివి ఇప్పుడు విభజనను వ్యతిరేఖిస్తూ చంద్రబాబు, జగన్ దీక్షలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నవేనని ఆయన విమర్శించారు.
http://www.teluguone.com/news/content/chandrababu-37-26389.html





