దక్షిణాదికి కేంద్రం పెద్ద పీట.. అందుకేగా?
Publish Date:Jul 9, 2022
Advertisement
దక్షిణాదిపై పట్టు బిగించే దిశగా బీజేపీ దూకుడు పెంచింది. ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. అప్పుడప్పుడు అధికారాన్ని అందిస్తున్న కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై బిజెపి బలపడేందుకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకుంటోంది. కర్నాటకలో బీజేపీ ఇప్పటికే పాగా వేసిందని చెప్పొచ్చు. దీంతో ప్రధానంగా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే కాదు.. అవకాశాలను కల్పించుకుంటోంది కూడా. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి అవకాశాలను కల్పించుకోవడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభకు యుపి నుంచి నామినేట్ చేసింది. ఇప్పుడు రాజ్యసభకు నామినేటెడ్ పోస్టులను దక్షిణ భారతావనిలోని నాలుగు రాష్ట్రాలకు చెందిన మరో నలుగురిని ఎంపిక చేసింది. మరీ ముఖ్యంగా ఇళయరాజా, పిటి ఉషలను రాజ్యసభకు ఎంపిక చేయడంపై బిజెపికి బుహుముఖంగా ప్రయోజనాలున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిరువురూ కేవలం దక్షిణాది ప్రతినిథులుగానే కాకుండా మొత్తం దేశంలోనే మెండుగా అభిమానులు ఉన్న వ్యక్తులు. గతంలో పద్మశ్రీ అవార్డుల్లోనూ ఈ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురిని బిజెపి ఎంపిక చేసింది. తెంగాణ నుంచి క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత్ బయోటెక్ (ఉమ్మడిగా), దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజా రెడ్డిలను (కళలు), ఏపి నుంచి గరికపాటి నర్సింహారావు (సాహిత్యం/విద్య), గోసవీడు షైక్ హుస్సేన్ (సాహిత్యం/విద్య), డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు (మెడిసిన్)లను సత్కరించింది. రాజ్యసభ సీట్ల భర్తీ.. కళలు, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయాలి. అలాగే చేసింది కూడా. అయితే ఈ ఎంపికలోనూ దక్షిణాదికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎంతలా అంటే నాలుగుకు నాలుగు నామినేటెడ్ పోస్టులనూ దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాలకు కట్టబెట్టింది. పిటి ఉష, ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, డా. వీరేందర్ హెగ్గడే. లను ఎంపిక చేసింది. ఇతర పోస్టుల్లోనూ దక్షిణ భారతావనికి చెందిన వారికి బిజెపి పెద్దపీటవేస్తూ వస్తోంది. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో బీజేపీ బలోపేతమయ్యేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోవడం లేదు. కర్ణాటకలో ఎలాగూ బలంగానే ఉంది. ఆ రాష్ట్రం ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాదిలో కాలూనేందుకు బీజేపీకి గేట్ వే అయ్యింది. దీంతో బీజేపీ మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి(తెలంగాణ) వి. మురళీధరన్ (కేరళ), గవర్నర్లుగా తమిళిసై సౌందర రాజన్( తమిళనాడు), బండారు దత్తాత్రేయ (తెలంగాణ)లకు అవకాశం ఇచ్చింది. ప్రజల్లో బలమైన సంకేతాలను పంపడం, బలంగా ముద్ర వేసే శక్తి సామర్థ్యాలు సినీరంగానికే అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇళయరాజాను, విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇళయరాజా ధక్షిణ భారతావనిలో ప్రతి ఒక్కరికీ సుపరిచితుడే. ఆయన సంగీతం వహించిన పాటలను విననివారుండరు. అందునా.. ఆయనకు అభిమానులు కూడా అధికశాతం మంది ఉన్నారు. ఇళయరాజాను ఎంపిక చేయడం ద్వారా చలనచిత్ర రంగ నిపుణులు బిజెపికి ఆకర్షితులవ్వడం, తద్వారా రానున్న ఎన్నికల్లో సినీరంగానికి చెందిన పలువురిని స్టార్ కాంపేయిన్ గా బిజెపి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు. విజయేంద్ర ప్రసాద్ బాహుబలి కథా రచన చేసింది ఆయనే. పిటి ఉషను ఎంపిక చేయడం ద్వారా దక్షిణ భారత క్రీడారంగానికి చెందిన వారిని కూడా బిజెపి ఆకట్టుకుంది. ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే పిటి ఉష ప్రస్తావన వచ్చే పరిస్థితుల్లో ఆమెను గుర్తించి రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా క్రీడారంగం వారి దృష్టిని తనవైపుకు బిజెపి తిప్పుకుంది. ఇలా దక్షిణ భారతావనిలో తన బలాన్ని పెంచుకునేందుకు దోహదం చేసే ప్రతి విషయాన్ని బిజెపి వదలుకోవడంలేదు. మరి రానున్న రోజుల్లో బిజెపి మరెంతమందిని ఏఏ గుర్తింపునిస్తుందో... ఏ హోదాలను అందిస్తుందో.. ఏ బాధ్యతలను అప్పగిస్తుందో.. వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/center-giving-top-priority-to-south-to-strengthen-in-south-states-25-139368.html





