మెట్టు దిగిన కేంద్రం.. అగ్నిపథ్ రిక్రూటీలకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్
Publish Date:Jun 18, 2022
Advertisement
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి అన్ని వర్గాల నుంచీ మద్దతు పెరుగుతోంది. నాలుగేళ్ల కాలపరిమితితో ఆర్మీలో రిక్రూట్ మెంట్ అన్న విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బీజేపీయేతర పార్టీలన్నీ అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అయితే వ్యవసాయ చట్టాలను ఎలాగైతే వెనక్కు తీసుకున్నారో అలాగే దేశంలోని యువతకు క్షమాపణ చెప్పి అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ అనంతర సమస్యలతో ప్రస్తుతం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ కూడా అగ్నిపథ్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. దిశా దిశ లేని ఈ విధానం వల్ల దేశంలో యువత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ ట్వీట్ చేశారు. యువత శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని సోనియా తన ప్రకటనలో సూచించారు. ఇలా ఉండగా అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శనివారం భారత్ బంద్ కు ఆర్మీ రిక్రూటీ ఆశావహులు ప్రకటించారు. వెంటనే కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకొవాలన్న డిమాండ్ తో ఆర్మీ ఉద్యోగార్థులు ఇచ్చిన ఈ బంద్ పిలుపునరకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ఈ బంద్ ప్రభావం దేశంలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇలా ఉండగా అగ్నిపథ్ పై నిరసనల కారణంగా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు తగ్గింది. త్రివిథ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అగ్నిపథ్ పై యువతలో వ్యతిరేకత, ఆందోళన తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిపథ్ కింద ఆర్మీలో రిక్రూట్ అయిన వారికి సీఎపీఎఫ్, అస్పాం రైఫిల్స్ లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో సవరణలు చేయనున్నట్లు తెలిపింది. తగిన అర్హత ఉన్న అగ్నిపథ్ రిక్రూటీలకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్ట్‌లతో పాటు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగగా తెలియజేసింది. అలాగే ప్రస్తుతమున్న ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుందని పేర్కొంది.
http://www.teluguone.com/news/content/center-agrees-to-give-reservation-to-agnipath-recruties-in-defence-sectot-jobs-25-137943.html





