బాణాసంచా దుర్ఘటన.. సంఘటనా స్థలానికి చంద్రబాబు.. స్పాట్ లో నలుగురు అధికారుల సస్పెన్షన్
Publish Date:Feb 28, 2026
Advertisement
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో పేలిన ఘటనలో మరణాలు అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితులకు.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకూ ఎక్స్ గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన నలుగురు స్థానిక అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శనివారం (ఫిబ్రవరి 28) విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రమాదం ఘటన గురించి తెలియగానే జిల్లా అధికారులతో, వివిధ శాఖలకు చెందిన మంత్రులతో మాట్లాడారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. అనంతరం నేరుగా కాకినాడ జిల్లా వేట్లపాలెం వచ్చారు. హెలీప్యాడ్ నుంచి సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ కారులోనే ముఖ్యమంత్రి ప్రయాణించారు. బాణాసంచా పేలుడు జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా కలెక్టర్, ఎస్పీలు ముఖ్యమంత్రికి వివరించారు. ఘటనా స్థలంలోనే సుమారు అరగంట పాటు అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కారులోనే సామర్లకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కాకినాడ జీజీహెచ్ కు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి... వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన.. ఈ ఘటనలో ఇరవై మంది మరణించారనీ, క్షతగాత్రులలో తొమ్మండుగురి పరిస్థితి విషమంగా ఉందనీ చెప్పారు. జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. కొద్దిరోజుల క్రితమే ఒక సంఘటన జరిగింది.. దాని తర్వాత ఇది రెండో ఘటన. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులను ఫిక్స్ చేస్తాం. ఆర్డీఓ, డీఎస్పీ, జిల్లా లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్లను తక్షణం సస్పెండ్ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
http://www.teluguone.com/news/content/cbn-announce-rs20lacs-exgeatia-36-214822.html





