వందేళ్ల వార్‌కి ముగింపు లేదా..?
Publish Date:Sep 13, 2016
Advertisement
కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ విధ్వంసానికి దారి తీస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారులు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, రామేశ్వరం ఇలా ప్రాంతమేదైనా జనం రగిలిపోతున్నారు. అసలు వివాదం తమిళనాటే మొదలైందంటున్నారు..కాదు కాదు, కన్నడీగులే మొదలుపెట్టారనే మాట వినిపిస్తోంది. అసలు వివాదం ఎలా మొదలైందంటే. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని తలకావేరిలో పుట్టింది కావేరి నది. 765 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంతో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదుల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అప్పట్లో కర్ణాటకలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అయితే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చాళుక్యరాజులు నిర్మించిన గ్రేటర్ ఆనకట్ట ద్వారా లక్షలాది ఎకరాలు సాగేయ్యేవి. కావేరికి నదికి ఇరువైపులా వాగులు, చెరువుల ద్వారా కొంత ఆయుకట్టును కర్ణాటక సాగు చేసేది. నీటి వినియోగంపై 1892లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ స్టేట్ మధ్య మొదటి వివాదం తలెత్తింది. దీనిపై మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ మహారాజా మధ్య ఒప్పందం కుదిరినా ఇరు వర్గాలు దానిని పాటించలేదు. అలా మొదలైన గొడవ ఇప్పటికీ రగులుతూనే ఉంది. మొదటి ఒప్పందాన్ని తుంగలో తొక్కడంతో 1924లో అప్పటి ప్రభుత్వం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చడంతో మరో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కావేరి జలాల్లో 75 శాతాన్ని తమిళనాడు, పుదుచ్చేరి, 23 శాతం కర్ణాటక, మిగిలిన 2 శాతం నీటిని కేరళకు కేటాయించారు. ఆ ప్రకారంగా కావేరిపై కృష్ణరాజసాగర్ డ్యాంను మైసూర్ ప్రభుత్వం నిర్మించింది. 50 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు రాలేదు, అయితే స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ తర్వాత వివాదం మరింత రాజుకుంది. ఒప్పందానికి తూట్లు పొడిచి కర్ణాటక డ్యామ్‌లు నిర్మించడాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 1924లో చేసుకున్న వివాదానికి కాలదోషం పట్టిందని నది పుట్టింది మా రాష్ట్రంలోనే కాబట్టి నదీ జలాలపై తమకే ఉందన్న వాదనను కర్ణాటక తెరపైకి తెచ్చింది. బ్రిటీష్ పాలకులు, మైసూర్ మహారాజుకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పడంతో తమిళనాడు ఆందోళనకు దిగింది. దీంతో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కె.ఎల్.రావు సమక్షంలో 1970 ఫిబ్రవరి 19న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తర్వాత కూడా అనేక సమావేశాలు జరిగాయి. 1972లో కేంద్రం నిపుణులతో ఓ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం 13 సార్లు సమావేశమైంది. 1985లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో.. కనీసం 360 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక కోరింది. 60 టీఎంసీలతో చేపట్టాలనుకొంటున్న ప్రాజెక్టులను మాత్రం నిలిపివేస్తామని పేర్కొంది. దీన్నిబట్టి మొత్తం నీటిని కర్ణాటక వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుందని తమిళనాడు ఆరోపించడంతో, 1986లో మరోసారి ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఇక్కడ కూడా రాజీ కుదరలేదు. శతాబ్దాలుగా సాగులో ఉన్న ఆయకట్టు దెబ్బతింటుందని, తంజావూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రెండు పంటలు పండే చోట ఒక పంటకే పరిమితం అవుతున్నామని తమిళనాడు ఆందోళన వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఓ అంగీకారం కుదిర్చేందుకు 16 సంవత్సరాలు కేంద్రం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జల వివాద ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 1990 జూన్ రెండున జస్టిస్ చిత్రతోష్ ముఖర్జీ ఛైర్మన్‌గా కావేరి జలవివాద ట్రైబ్యునల్ ఏర్పాటైంది. తమవద్ద కనీస నీటి లభ్యత కూడా ఉండటం లేదన్న తమిళనాడు ఫిర్యాదుకు స్పందించి 1991 జూన్ ఐదున మధ్యంతర తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం మెట్టూరు డ్యాం వద్ద తమిళనాడుకు 205 టీఎంసీల నీటి లభ్యత ఉండాలని స్పష్టంచేసింది. ఏ నెలలో ఎంత నీటి విడుదల ఉండాలో కూడా పేర్కొని, దీని అమలుకు కమిటీని కూడా నియమించింది. ట్రైబ్యునల్ 2007 ఫిబ్రవరి ఐదున తుది తీర్పు ఇచ్చింది. దీనిపై 2008 నవంబరు రెండువరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఇదే సమయంలో తుది తీర్పును గెజిట్‌లో ప్రకటించకుండా తమిళనాడు, కర్ణాటకలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాయి. అప్పట్నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సుధీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు వెలువరించిన సుప్రీం రోజుకు 15 వేల క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును జీర్ణించుకోలేని కర్ణాటకలోని ప్రజలు, రైతు సంఘాలు నీటిని విడుదల చేయరాదంటూ రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. ఇది కాస్తా ఉద్రిక్తమై హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే శక్తి వంద సంవత్సరాల కాలానికే లేకపోయింది కాబట్టి నీటిపైనా వాటా విషయంలో తమిళులది తప్పా, కన్నడీగులది తప్పా అనేది నిర్థారించే శక్తి లేనట్టే..? అలా కాకుండా అర్థం లేని ఆవేశాలు ప్రదర్శించుకోవడం ఇరు రాష్ట్రాలకు మంచిది కాదూ. పరస్పరం సహకరించుకుని సాగాల్సిన వాళ్లు ఇలా విధ్వంసాలు సృష్టించుకోవడం అత్యంత బాధాకరమైన అంశం.
http://www.teluguone.com/news/content/cauvery-river-dispute-37-66446.html





