విరాళం కాస్తా వివాదంగా మారుతోంది!
Publish Date:Sep 11, 2016
Advertisement
కాంగ్రెస్ కష్టాల్లో వుంది.... 2014లో మోదీ ప్రభంజనం తరువాత ఆ పార్టీ ఎక్కడా కోలుకోలేకపోతోంది! ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఓ రాష్ట్రం హస్తం చేజారిపోతోంది. ఈ రాజకీయ కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చిపడింది! అదే జకీర్ నాయక్ విరాళం!.
జకీర్ నాయక్ ఎవరో తెలుసుగా? పీస్ టీవీ అంటూ ఒక ఛానల్ పెట్టుకుని ఇస్లాం మత ప్రచారం చేస్తుంటాడు ఈ ప్రబోధకుడు. అంతే అయితే ఇంత గొడవ వచ్చేదే కాదు. తన పీస్ టీవీలో తన ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. ఇతర మతాల్ని వీలైనంత కించపరుస్తుంటాడు. ఇస్లామ్ ని గొప్పగా అభివర్ణిస్తుంటాడు. అసలు జకీర్ నాయక్ ఏ రేంజ్లో ప్రబోధిస్తాడంటే మొన్నా మధ్య బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. విదేశీయుల్ని టార్గెట్ చేసి కిరాతకంగా చంపారు! వారికి ప్రేరణ ఈ జకీర్ నాయక్ వారే! ఆయన ఉన్మాద ప్రబోధాలే!
జకీర్ నాయక్ బోధనలు ఉగ్రవాదానికి కారణమవుతున్నాయి ఇండియా కాదు... ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశే ఆరోపించింది! అతడిపై చర్య తీసుకోమని ఇండియాని కోరింది కూడా! అప్పుడు రంగంలోకి దిగిన మోదీ సర్కార్ జకీర్ పై కన్నేసింది. అతడి ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంగతేంటో తరిచి చూసింది. ఇదంతా చూసి బెదిరిపోయిన జకీర్ నాయక్ విదేశాలకు వెళ్లి అక్కడే తలదాచుకున్నాడు!
జకీర్ ఉదంతం ఇంత వరకు ఉగ్రవాదానికే పరిమితమైంది. కాని, తాజాగా అతడు 50లక్షల భారీ విరాళం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు ఇచ్చాడని తెలియటంతో పొలిటికల్ కలరింగ్ వచ్చింది! జకీర్ ప్రసంగాలు యూట్యూబ్ లో చూస్తే ఎవరికైనా అతడు ఎంత కరుడుగట్టిన మత ఛాందసవాదో తెలిసిపోతుంది! అలాంటి వ్యక్తి నడిపే సంస్థ నుంచి రాజీవ్ పేరు పెట్టుకుని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల నేతృత్వంలో నడిచే సంస్థ విరాళం తీసుకోవటం ఏంటి? తిరిగి ఇచ్చేశామని కాంగ్రెస్ ఇప్పుడు చెబుతున్నా... అసలు ఎందుకు తీసుకున్నారో చెప్పాల్సి వుంది! ఎప్పుడూ హిందూ ఛాందసవాదం, అరెస్సెస్ , వీహెచ్ పీల్ని ఆడిపోసుకునే గాందీలు జకీర్ లాంటి ఇస్లామిక్ మత ఛాందసవాది నుంచి ఛందాలు తీసుకోవచ్చా? ఛాందసవాదం అంటే కేవలం హిందూ మతానికి పరిమితమైందా? ఇస్లామిక్ మత సంస్థలు ఆటోమేటిక్ గా సెక్యులర్ అయిపోతాయా?
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, 2011లో జకీర్ నుంచి విరాళం తీసుకుంది కాంగ్రెస్ కు అనుబంధంగా నడిచే రాజీవ్ గాంధీ ఫౌండేషన్. ఆ తరువాతి సంవత్సరం ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా అతడి పీస్ టీవీని ఇండియాలో బ్యాన్ చేసింది అదే కాంగ్రెస్! కాని, అప్పుడు కూడా జకీర్ విరాళం అతడికి తిరిగి ఇచ్చేయలేదు. ఢాకాలో హేయమైన దాడి జరిగాక 50లక్షలూ తిరిగి ఇచ్చారట!ఎన్నికలు వచ్చినప్పుడల్లా సెక్యులర్ పాఠాలు వల్లించే కాంగ్రెస్ ఇలా అడ్డంగా దొరికిపోవటం మన దేశంలోని రాజకీయ పార్టీల ద్వంద్వ ప్రవృత్తికి తార్కాణం!
http://www.teluguone.com/news/content/-zakir-naik-37-66333.html





