పేర్ని నానిపై కేసు..మళ్లీ అజ్ణాతంలోకేనా?
Publish Date:Oct 11, 2025
Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేర్ని నాని తెలియని వాళ్ళు ఉండరు. వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన పేరే. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో ఉండే పేర్ని నాని.. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుండి తన నోటికి గట్టిగా పని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ నోటికి అడ్డూ అదుపూ లేదన్నట్లుగా బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన కొడాలి నాని వంటి వారు అధికారం కోల్పోయిన తరువాత సైలెంటైపోయారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత నిన్న మొన్నటి వరకూ అంబటి రాంబాబు తన గళానికి పని చెప్పారు. అయనా ఈ మధ్య ఎందుకో మౌనం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నుంచీ పేర్ని నాని వాయిస్ ఆఫ్ వైసీపీ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అయితే ఎంత రెచ్చిపోయినా.. పేర్నినాని ఒక విషయంలో మాత్రం గొప్ప పరిణితి ప్రదర్శిస్తున్నారు. తనపైన ఏదైనా కేసు నమోదైతే.. ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాదు. సరే సదరు కేసులో కోర్టులో ఊరట లభించిందంటే చాలు అజ్ణాతం వీడి బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో రెచ్చిపోతుంటారు. పేర్న నానిపై గతంలో కేసు నమోదైన ప్రతిసారీ కూడా ఆయన ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేయడం తెలిసిందే. గతంలో నానిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలోనూ, అలాగే రేషన్ గోదాముల కేసు సమయంలోనూ కూడా పేర్ని నాని ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాతంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదైంది. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనీ కేసు నమోదైంది. ఇంతకీ జరిగిందేంటంటే.. పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఠాణాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పేవరకూ పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీసీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మేకల సుబ్బన్నను పోలీసులు శుక్రవారం (అక్టోబర్ 10) అరెస్టు చేశారు. దీంతో పేర్ని నాని పెద్ద సంఖ్యలో అనుచరులతో చిలకలపూడి స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేశారు. సీఐతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నానిపై కేసునమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనీ, సీఐపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో కూడా బెయిలు దొరికే వరకూ నాని అజ్ణాతంలోకే అంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/case-on-perni-nani-39-207755.html





