‘ఉచితాలు’ కొనసాగించలేక దైన్యం- ‘ముందస్తు’తో గట్టెక్కాలని వైసీపీ ఆత్రం
Publish Date:Apr 26, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ముందస్తుకు వెళ్లాలన్న యోచనలో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అన్ని వర్గాలలో నెలకొన్న అసంతృప్తిని పరిగణనలోనికి తీసుకుని...గట్టెక్కాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే శరణ్యమన్న నిర్ణయానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వర్గాలలో జగన్ సర్కార్ పట్ల ఏదో ఒక స్థాయిలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. అయితే రానున్న రోజులలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులున్నా ‘ఉచిత’ పథకాలను కొనసాగిస్తున్నారు. అయితే రానున్న రోజులలో వీటిని కొనసాగించే అవకాశం ఏ మాత్రమూ లేదని అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారడం ఖాయమన్న భావన వైసీపీలోనే వ్యక్త మౌతున్నది. అందుకే ఈ పథకాలు కొనసాగించలేని పరిస్థితి వచ్చే లోగానే...అంటే ఈ పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లి గట్టేక్కాలని జగన్ భావిస్తున్నారు. పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లడం ద్వారా సంక్షేమానికి చాంపియన్ గా నిలిచానని ప్రచారం చేసుకోవడంతో పాటు మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్న వాగ్దానాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అలా కాకుండా పూర్తి కాలం అధికారంలో ఉండి...గడువు ప్రకారమే ఎన్నికలకు వెళ్లినట్లైతే...ఆప్పటి వరకూ పథకాలు కొనసాగించే అవకాశం ఉండదనీ, అందు వల్ల వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన ప్రభుత్వంగా ప్రజల ముందకు వెళ్లాల్సి వస్తుందని, అదే జరిగితే విఫల నేతగా జనం ముందుకు వెళ్లాల్సి వస్తుందనీ, అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెప్పారు. ఆ కారణంతోనే ముందస్తుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మరో రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ జగన్ ముందస్తుకే మొగ్గు చూపడానికి కారణం ఉచిత పథకాలను కొనసాగించలేని దైన్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cant-continue-freebes-jagan-prefers-early-elections-25-135000.html





