ఆర్టీసీ సమ్మె.. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్
Publish Date:Apr 22, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యో గులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ ప్రతినిధుల తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జేఏసీకి చెందిన నాయకులు సచివాలయం లో నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవ డంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద సమ్మె కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపోల ముందు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల వద్ద ఉదయం నుంచే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 32 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. డిపో గేట్ల వద్ద బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. బస్సుల నిలిపివేత ప్రభావం సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా పడింది. ఉదయాన్నే విధులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లకు చేరుకున్న ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్ వంటి జిల్లాల్లో సమ్మె ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్ రీజియన్‌లో దాదాపు 641 బస్సులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 850 బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. మరోవైపు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. కొన్ని ప్రాంతాల్లో అద్దె బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రయాణికుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుండి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. సమ్మె కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. మరో వైపు తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/buses-halted-across-telangana-36-217908.html





