ఆర్ధిక బడ్జెట్ పై కూడా మోడీ మార్క్?
Publish Date:Jul 9, 2014
Advertisement
ఆర్ధిక బడ్జెట్ పై కూడా మోడీ మార్క్? కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2013-14 సం.ల ఆర్ధిక సర్వే వివరాలను ఈరోజు లోక్ సభకు సమర్పించారు. గత ఏడాది కాలంలో యూపీఏ ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటిపై అంచనాలు, అసలు ఫలితాలు, ముఖ్యాంశాలు సభకు వివరించి, గొప్ప ఆర్దికవేత్తగా పేరు గాంచిన డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోయిందని తేల్చి చెప్పారు. యూపీఏ హయాంలో గత రెండేళ్లుగా వృద్ధి రేటు 5శాతం కంటే తక్కువగా ఉండటం చాలా ఆందోళనకరంగా మారిందని, 2014-15సం.లలో తమ ప్రభుత్వం దానిని కనీసం 5.9శాతానికి పెరిగేలా తప్పకుండా గట్టిగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ, ఇప్పుడు కనబడుతున్న ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అనుచిత నిర్ణయాల వల్ల ఏర్పడినవేనని, తమ ప్రభుత్వం తీసుకొంటున్న కటిన చర్యల కారణంగా త్వరలోనే ధరలు తగ్గుముఖం పడతాయని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదల గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజాకర్షక విధానాల వలన దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుదేలయిందని దానిని తమ ప్రభుత్వం తప్పకుండా గాడిలో పెట్టి దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు తీయించేందుకు ధృడసంకల్పంతో ఉందని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటలను బట్టి రేపు ఆయన ప్రవేశ పెట్టబోయే ఆర్ధిక బడ్జెట్టులో పెద్దగా ప్రజాకర్షక పధకాలేవీ ఉండకపోవచ్చని అర్ధమవుతోంది. స్వాత్రంత్రం వచ్చినప్పటి నుండి చాలా దశాబ్దాలపాటు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బడ్జెట్ లో ప్రజాకర్షక పధకాలు తప్పనిసరి అనే భావన ప్రజలలో కల్పించి అందుకు అనుగుణంగానే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చింది. వాటి వల్ల దేశానికి ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోగా అటువంటి వాటిని అమలు చేసేందుకు మళ్ళీ ప్రజల నెత్తినే పెను భారం మోపేది. కానీ దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో ముందే నిర్ణయించుకొన్న మోడీ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే బడ్జెట్ తయారు చేసుకొంది. నిన్న రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్టు చూసినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది. అందువలన రేపు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే ఆర్ధిక బడ్జెట్టులో కూడా ఎటువంటి ప్రజాకర్షక పధకాలు ఉండక పోవచ్చును. అదే దేశానికి ఆరోగ్యకరం కూడా!
http://www.teluguone.com/news/content/budget-37-35717.html





