ముందస్తు జాబితాకు కేసీఆర్ కసరత్తు!?
Publish Date:Jun 19, 2023
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ లో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సిట్టింగులకు అందరికీ టికెట్లని ప్రకటించిన క్షణం నుంచీ పార్టీలో అసమ్మతి రగడ పెరగడంతో దానిని చల్లార్చేందుకు కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు అన్న తన మాటను తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేత ఖండింప చేసి టికెట్ ఆశావహుల్లో ఆశలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇక కీలక మంత్రి కేటీఆర్ అయితే పని చేసే సిట్టింగులకే టికెట్లు అంటూ చేసిన ప్రకటన ఫిల్టరింగ్ వార్నింగ్ గా పరిశీలకులు అభివర్ణించారు. 2019 ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి కుప్పలు తెప్పలుగా నాయకులను పార్టీలోకి ఆకర్షించిన ఫలితమే బీఆర్ఎస్ లో ప్రస్తత అసంతృప్తి, అసమ్మతికి కారణంగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తొలి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి రిక్తహస్తం, కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి పెద్ద పీట అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉండటంతోనే 2024 ఎన్నికల ముందు పార్టీలో అసమ్మతి జ్వాలలు పార్టీనే దహించేస్తాయా అన్నంతగా ఎగసిపడుతున్నాయంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే యత్నాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. పార్టీ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించేసి అసమ్మతిని అణచివేయాలన్న వ్యూహంతో కేసీఆర్ అడుగులు ముందుకు వేస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందుకే ఆషాఢం వెళ్లగానే వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఆషాఢం వెళ్లే వరకూ ఆగడం అన్నది కేసీఆర్ కు ఉన్న సెంటిమెంటే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసంలో కనీసం 30 స్థానాలలో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారనీ, ఆ స్థానాలన్నీ పార్టీ టికెట్ కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉన్న స్థానాలేననీ అంటున్నారు. ఆయా స్థానాలలో వచ్చే నెల రెండో వారంలోనే అభ్యర్థులను ప్రకటించేసి పూర్తి స్థాయిలో ఎన్నికల సమరాంగణానికి సన్నద్ధం అవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చడానికి, పార్టీలో కొనసాగేవారెవరో, బయటకు వెళ్లే వారెవరో అన్న విషయం ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి.. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులకు పరిస్థితులను తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి కావలసినంత సమయం ఉంటుందన్నది కేసీఆర్ భావనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందుగా అభ్యర్థుల్నిప్రకటించేయడం వల్ల అసంతృప్తులు, అసమ్మతి వాదులు చివరి క్షణంలో రెబల్స్ గా రంగంలోకి దిగి పార్టీ ఇబ్బందుల్లోకి పడే పరిస్థితి ఉండదన్నది కేసీఆర్ భావనగా చెబుతున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించేయడం వల్ల నిరాశ చెందిన ఆశావహులు ఉంటే ఉంటారు, పార్టీని వీడితే వీడతారు దీని వల్ల ఆఖరి క్షణంలో ఎవరు పార్టీకి ఎదురు తిరుగుతారా అన్న భయం ఉండదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/brs-candidates-list-three-months-earlier-39-157042.html





