పాట జీవితం అయిన వేళ
Publish Date:Jul 19, 2021
Advertisement
విజయవాడ, ఆటోనగర్ నుంచి ఎన్టిఆర్ సర్కిల్ కి వెళ్లే పంటకాలువ రోడ్ అది. లైఫ్ స్టైల్ సంబంధించి ఎదో కంటెంట్ రాయడానికి ఆలోచిస్తూ బుర్రకి ఏదీ గోచరించక పరధ్యానంగా ఇంటికి వెళ్తున్నా. వర్షం వచ్చేలా ఉందని ఎక్సలేటర్ కొంచెం రేజ్ చేసాను. నాలుగు రోడ్ల కూడలికి వచ్చేసరికి "హా.... నా గొంతు శృతిలోనా" అని ఒక రాగం శ్రావ్యంగా వినిపించింది.పాట కచేరీ ఎదో జరుగుతుందని అనుకున్నాను. ఇద్దరు అందకళాకారుల తమకి సహాయం చేయమని ఊరికే డబ్బులు అర్ధించకుండా వెచ్చని సాయంత్రాన్ని వింజామారాలతో చల్లార్చినట్లు మధురమైన గానంతో మత్తెక్కిస్తున్నారు. కాసేపు నిలబడి చూసాను. "పాట జీవితాన్ని అభిషేకిస్తున్నట్లు సుందర దృశ్యం కనిపించింది" నేను తీసిన చిత్రాలకి అపుడు విన్న పాటనే అతికించాను. *"నా గొంతు శృతిలోనా.....! *అవును మీ గొంతు శృతి, మీ గుండె లయ- మనసు ద్యుతితో కలిసిన మీ హృదయం నుంచి ఆ రాగం వస్తుంటే జీవితం తేనె కలిసిన లెమన్ టీ ఫ్లేవర్ లా ఫ్రెష్ గా ఉంది. కోయిలే కాదు ప్రాణం లేని రాళ్లు కూడా ఆడతాయి పాడతాయి* *"ఒక మాట పది మాటలై- అది పాట కావాలని"* *మాట మాత్రమే కాదు మీ ఉచ్వాశ నిస్వాస లోంచి కూడా సంగీతమే వస్తుంది.నిలబడి విన్నోడికి అది తెలుస్తుంది. అలా వింటే ఎక్కడరా బాబూ లేనిపోని ఫిలాసఫీ ని నెత్తినేసుకొని అర్జంట్ గా సత్యం తెలుసుకొని సచ్చీలులం అయిపోతే మన ఘనకార్యాలన్నీ ఆగిపోతాయి అని మనిషికి భయం. మారడానికి మనిషి సిద్ధంగా లేడు అనిపిస్తుంది. అంతెందుకు ఈ సోదంతా రాస్తున్న నేను కూడా ఉన్నపలంగా మారిపోలేను. కానీ కొంచెం అయినా మారాలనిపిస్తుంది. ఒక సెకను ఆలోచిస్తే చాలా స్వల్పం అయిన విషయాలకు అశాంతికి తలుపులు తెరిచి ప్రశాంతతకు తాళాలేసుకొని ద్వేషాన్ని మోసే మన అజ్ఞానంలో కొంచెం మార్పు వస్తుందని చిన్న ఆశ* *ఒక జన్మ కాదు వంద జన్మలైనా సరే మీతోపాటు నా కళ్లు కూడా తీసేసుకొని అనుబంధం పంచుకోవాలని ఉంది.-ఆ కళ్లను సత్యం చూడలేని ఈ ప్రపంచానికి ఇవ్వు అని దేవుణ్ణి కోరాలని ఉంది.* జీవితం అంటే ఏంటి? అందులో జీవన విధానం అంటే ఏంటి? ఎలా బ్రతకాలి? ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా సర్వై కావాలి అని తెగ ఆలోచిస్తుంటాము. ఆ విషయం ఎవరైనా చెప్పాలి లేదా ఎక్కడైనా చూసి నేర్చుకోవాలి. ఎవరో చెప్పడం ఎందుకు? ఎక్కడో చదవడం ఎందుకు? చీకటి తప్ప వెలుతురు తెలీని ఆ అందకళాకారులను చూస్తే సరిపోతుంది కదా అనిపించింది. వారితో కలిసి "జీవితం తనని తాను అన్వేషించుకుంటుంది". "తనని తాను శోధించుకుంటుంది". శ్రీ శ్రీ గారు అంటారు "సాయంత్రం ఆరు అవుతుంది. గదిలో ఒక్కడినే ఉన్నాను. చీకటి చినుకుల్లా కురుస్తుంది" అని. కానీ వీళ్లకి చీకటి నిత్యం కుంభవృష్టిలా కురుస్తుంది. దాని వలన భౌతిక ప్రపంచం మాత్రమే చూడలేరు గానీ తమలోకి తాము సందర్శించుకొని అందమైన ప్రపంచానికి తారల్ని తగిలిస్తూ నిత్యం దేదీప్యమానంగా వెలుగుతుంటారు. వారినీ, వారి పాటని,మాటని పది నిమిషాలు కదలకుండా వింటే ఈ ఉరుకులు, పరుగులు, అధికారం, హోదా, కష్టం, సుఖం, బాధా, బందీ,ఆధిపత్య,అహం, అహంకారం, పగలు, ప్రతీకరాలు,కక్ష్యలు, కార్పణ్యాలు, పనికిమాలిన ఎంటర్టైన్మెంట్ అంతా నాన్సెన్స్ లా అనిపిస్తుంది. ఇంత conflict లోంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా! వాళ్ళని చూస్తే అరే ఇంత మధురమైన, అందమైన, శ్రావ్యమైన, రాగవంతమైన, మనో వికాస ప్రకాశిక జీవితం ఇంత తేలికా? అనిపిస్తుంది.ఒక యూనిట్ జ్ఞానోదయం అయినా కలిగిస్తుంది. ఎందుకంటే పాట అక్కడ జీవితాన్ని అభిషేకిస్తుంది. ◆వెంకటేష్ పువ్వాడ
నా గుండె లయలోనా.....!
ఆడవే పాడవే కోయిలా...!"*
*"ఒక జన్మ పది జన్మలై-అనుబంధం అవ్వాలనీ"*
http://www.teluguone.com/news/content/blind-singers-enthral-public-on-road-35-119849.html





