మోడీని కేసీఆర్ కలిసింది అందుకే? ఢిల్లీ డీల్స్ బయటపెట్టిన బీజేపీ నేత..
Publish Date:Sep 13, 2021
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం హస్తిన వెళ్లిన గులాబీ బాస్.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పలువురు కేంద్రమంత్రులను కలిశారు కేసీఆర్. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ నేతలు సై అంటే సై అంటున్న పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీ పెద్దలను కేసీఆర్ కలవడం ప్రాధాన్యతగా మారింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన పరిణామాలు తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారాయి. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే మరో కీలక పరిణామం జరిగింది. ప్రధానిని కేసీఆర్ కలిసిన మరుసటి రోజే పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఖచ్చితంగా ఉంటుందని భావించిన హుజురాబాద్ ఉప ఎన్నిక అందులో మిస్సైంది. బైపోల్ ఆలస్యమైతే ఈటల రాజేందర్ కు ఇబ్బందులు వస్తాయనే చర్చ సాగుతుండగానే.. ఉప ఎన్నికను వాయిదా వేస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధానమంత్రితో కేసీఆర్ మాట్లాడటం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందనే చర్చ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ ను బీజేపీ బలి పశువు చేసిందని చెప్పారు. అయితే తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన, కేంద్రం పెద్దలతో సమావేశాలకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అతి త్వరలోనే షెడ్యూల్ వస్తుందన్నారు. కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి ఎన్నికలు వాయిదా వేయించేంత దమ్ములేదన్నారు జితేందర్ రెడ్డి. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు.. అప్పు కావాలని బ్రతిమాలడానికే మోడీ దగ్గరకు వెళ్లాడని తెలిపారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించబోతున్నారని, త్వరలో విజయోత్సవాలు జరుపుకోబోతున్నామని హుజురాబాద్ మధువని గార్డెన్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో జితేందర్ రెడ్డి కామెంట్ చేశారు. హుజురాబాద్ ప్రజలంత తమ వెంటే ఉన్నారని చెబుతున్న హరీష్ రావు.. ఎందుకు కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ వరాలు ఇస్తున్నారని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. డబ్బులు, మద్యం పంచినా టీఆర్ఎస్ సభలకు జనం పెద్దగా పోవడం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు చెప్పే అబద్ధాలు ప్రజలు వినివినీ నమ్మడం మానేశారని అన్నారు జితేందర్ రెడ్డి. దళిత బంధు పేరుతో ఖాతాల్లో డబ్బులు చేస్తూ ఫ్రీజ్ చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పుకుంటున్న హరీశ్ రావు.. ఒక్క రోజైనా తన ఆఫీసులోకి వెళ్లాడా? అని ప్రశ్నించారు. తాను కూర్చునేందుకే ఆఫీసు లేదు.. ఇక్కడికొచ్చి అన్ని కులసంఘాలకు బిల్డింగ్ లు కట్టిస్తానని చెబితే జనాలు ఎలా నమ్ముతారని నిలదీశారు. నీతివంతుడైన ఈటలకు ఓటేస్తారా... ? ఓ దొంగకు వేస్తారా ఆలోచించుకోవాలని ఓటర్లను కోరారు జితేందర్ రెడ్డి.
http://www.teluguone.com/news/content/bjp-leaders-reveals-pm-modi-kcr-meeting-facts-39-122913.html





