ఎన్నికలకు కమలం రె‘ఢీ’.. తెలంగాణలో ముందస్తు ఖాయమని ఫిక్స్
Publish Date:May 1, 2022
Advertisement
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న నిశ్చితాభిప్రాయంలో కమలనాథులు ఉన్నారు. తెరాస ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినదానికీ, కానిదానికీ కేంద్రంపైనా, మోడీపైనా నిప్పులు చెరుగుతూ ప్రసంగాలు చేయడం వెనుక ముందస్తు వ్యూహమే ఉందన్నది కమలదళం భావిస్తున్నది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది. నాయకులు, కార్యకర్తలూ నిత్యం ప్రజలలోనే ఉండేలా పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తున్నది. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నం అయిపోయింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలకు జాతీయ నాయకత్వం ఆశీస్సులు ఉండటంతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అధికార తెరాసకు చెక్ పెట్టడానికి అందివచ్చిన ఏ చిన్న సంఘటననూ వదులుకోవడం లేదు. రాష్ట్ర నాయకత్వమే కాకుండా జాతీయ స్థాయి నాయకులు కూడా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికీ, విమర్శించడానికి వెనుకాడటం లేదు. రాష్ట్రంలో పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వరకు అందరికీ జాతీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోని నాయకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించింది. ఆయా నియోజకవర్గాలలో పార్టీలో ఉన్న లోపాల, బలహీనతలను గుర్తించి బూత్ స్తాయిలో నుంచీ పార్టీ బలోపేతంపై శ్రద్ధ పెడుతున్నారు. బిజెపిలో మహిళా విజయశాంతి, డికె అరుణ, రాణి రుద్రమరెడ్డి వంటి బలమైన మహిళా నేతల సేవలను మరింత సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా అధికార పార్టీకి చెక్ పెట్టే అవకాశం ఉందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ ముగ్గురి చేతా తెలంగాణ సిఎం కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శణాస్త్రాలను సంధింప చేయడం ద్వారా తెరాస ఎదురుదాడికి దిగే అవకాశం లేకుండా చేసే వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తున్నది. మోడీ, అమిత్ షా, బండి సంజయ్ వంటి నేతల విమర్శలను దీటుగా ఎదుర్కొనే తెరాస మంత్రులు, సీనియర్లు బీజేపీ మహిళా నేతల విమర్శనాస్త్రాలను దీటుగా తిప్పి కొట్టడంలో విఫలమౌతున్నారని పరిశీలకులు సైతం అంగీకరిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను బట్టి తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని భావిస్తున్న కమలనాథులు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఖమ్మంలో పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర హెూం శాఖ మంత్రి నేరుగా ఆ కార్యకర్త ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అయినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకోవడం రాష్ట్రంపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దష్టి పెట్టిందనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలింతకీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు సాధికారిక సమాధానం దొరకదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ‘ముందస్తు’ ఉంటుందా, ఉండదా అన్నది తేలుతుంది. ఆయన ఇప్పటికే ముందస్తు ఉండదని ఖరాకండీగా చెప్పినా, కమల నాథులు మాత్రం విశ్వసించడం లేదు. వేగంగా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందనీ, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా ప్రజలలో ఇంకా పలుచన కాకముందే...ముందస్తుకు వెళ్లి సత్ఫలితం రాబట్టాలన్నది కేసీఆర్ వ్యూహమనీ కమలనాథులు అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అందుకే ముందస్తు లేదు లేదంటూనే కేసీఆర్ ముందస్తు గంట మోగించే అవకాశాలున్నాయన్నది బీజేపీ అభిప్రాయం. అందుకే ఇప్పటి నుంచీ ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమైపోయింది. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తుకు ముహూర్తం పెట్టే అవకాశాలున్నాయన్న అంచనాతో బీజేపీ.. ఇప్పటి నుంచే జాతీయ నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార శంఖారావం మోగించే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల సమయంలో అయితే బీజేపీ అగ్రనేతలకు రాష్ట్రంపై దృష్టి పెట్టే సావకాశం ఉండదనీ, అందుకే కేసీఆర్ ముందస్తుకు అప్పుడే ముహూర్తం పెడతారనీ బీజేపీ ఊహిస్తోంది. దాంతో ఇప్పటి నుంచే రాష్ట్ర పర్యటనకు పార్టీ జాతీయ నాయకులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఏది ఏమైనా కమల నాథుల ఎన్నికల సన్నాహాలూ, కేంద్రంపై తెరాస విమర్శల జోరూ వెరసి రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరో వైపు రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ లో కూడా ఎన్నికల సమరోత్సాహం కనిపిస్తున్నది.
http://www.teluguone.com/news/content/bjp-kick-starts-election-preparations-in-tstate-25-135297.html





