బీజేపీ గాలి తీసేసిన ఆత్మసాక్షి సర్వే
Publish Date:Jul 15, 2022
Advertisement
పెళ్లిళ్లలో పెద్ద బావగారిలా హడావుడి చేసినంత మాత్రాన అన్నీ అయిపోవు, అత్తరూ రాయరు. కేంద్రంలో అధికారంలో వున్నంత మాత్రాన బిజెపి అన్ని రాష్ట్రాల్లోనూ దబాయించి అధికారం చేజిక్కించుకోవచ్చన్న ధోరణిలో మరీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ తెలంగాణాలో ఇటీవలి సర్వే మాత్రం ఆ దూకుడుతో కమలం బోర్లా పడే అవకాశాలే చాలా వున్నాయని తేల్చింది. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణాలో బిజెపి మూడో స్థానానికే పరిమితమౌతుందని ఆత్మసాక్షి సర్వే కుండబద్దలు కొట్టేసింది. ఈ సర్వే తెలంగాణలో గులాబీ పార్టీకి ఈ సారి 39.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అంటే 56 నుంచి 59 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 31.5 శాతం ఓట్లు వస్తాయనీ, 37 నుంచి 39 స్థానాలలో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయనీ అంచనా వేసింది. ఇక బీజేపీకి కూడా 21 శాతం ఓట్లు పడే అవకాశం ఉందనీ, సీట్ల పరంగా 14 నుంచి 16 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనీ ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. రాష్ట్రంలో మొత్తం మీద టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సర్వే తేల్చేసింది. ఇక ఎంఐఎం కు 2.75 శాతం ఇతరులకు 3.25 శాతం ఓట్లు పడనున్నాయి. సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.88 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది ఆత్మసాక్షి. సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ధరణి, వడ్ల కొనుగోలు, ఎంప్లాయిమెంట్, శాంతి, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన తీరు వంటి 40 అంశాలపై ప్రశ్నలు రూపొందించినట్లు ఆత్మసాక్షి గ్రూప్ సంస్థ సీఈవో మూర్తి తెలిపారు. తాము ఇంతవరకు 18 రాష్ట్రాల్లో ఇలా సర్వేలు చేశామని చెప్పారు. అయితే అందులో 16 రాష్ట్రాలలో తమ సర్వే కచ్చితమైన ఫలితాలను వెల్లడించిందని వివరించారు. . కేవలం రెండు రాష్ట్రా ల్లో మాత్రమే తమ అంచనాలు తప్పాయని పేర్కొన్నారు. ఈ సర్వే మొత్తం జూన్ 30వ తేదీ నాటికి పూర్తయింది. టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన దళిత బంధు పథకమే ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ను దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు 1.5 శాతం మంది దళితులు గులాబీ పార్టీకి దూరంగా జరిగారనీ సర్వే పేర్కొంది. వడ్లు కొనుగోలు జాప్యం, ఇంధన ధరల పెరుగుదలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వే లో తేలిందని ఆత్మసాక్షి పేర్కొంది.
http://www.teluguone.com/news/content/atma-sakshi-survey-says-bjp-will-confine-to-third-place-in-telangana-39-139821.html





