‘ఆశా’ నిరాశేనా? మిగిలేదీ చింతేనా?
Publish Date:Nov 7, 2015
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అందించే ఆశా వర్కర్లు గత 65 రోజులుగా ఆందోళనా కార్యక్రమాలు చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని, వైద్య సేవ చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమ జీవితాలు కొద్దిగా అయినా మెరుగు పడాలని కోరుకుంటూ ఆశా వర్కర్లు ఉద్యమించారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనల లాంటివి తెలంగాణ వ్యాప్తంగా గత 65 రోజులుగా చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో కొద్దిమాత్రమైనా కదలిక కనిపించడం లేదు. ఆశా వర్కర్ల వేతనాలను పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీదే పూర్తి బాధ్యతను నెట్టేసి తాను తప్పించుకోజూస్తోందన్న విమర్శలను ఆశా వర్కర్లు చేస్తున్నారు. తాము ఇన్ని రోజులుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమని వారు అంటున్నారు.
ఆశా వర్కర్ల వేతనాలు పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండి పట్టుదల విడిచిపెట్టి ఒక్క మెట్టు కూడా దిగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఆశా వర్కర్లకు జీతాలు చాలా తక్కువగా ఇస్తూ వుండటం మాత్రమే కాదు.. నెలనెలా సక్రమంగా కూడా ఇవ్వడం లేదు. ఆశా వర్కర్లకు ఇచ్చే జీతాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో వుండటం వల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని తెలంగాణ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆందోళనలు, ఉద్యమాలు చేస్తే చేసుకోండని ఊరుకుంది. ఆశాల జీతాలను 20 నుంచి 30 శాతం వరకు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకుంది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కేంద్రం జీతాలు పెంచకపోతే ఆ పెరిగే జీతాల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడమే మేలన్న ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశా వర్కర్ల ఆశలు నిరాశే అయ్యేట్టున్నాయని... వారికి మిగిలేది చింతేనని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/asha-workers-45-52138.html





