అసెంబ్లీకి డుమ్మా.. పార్లమెంటుకు హాజరు.. జగన్ ద్వంద్వ నీతి
Publish Date:Dec 2, 2025
Advertisement
ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కాదు కాదు దిశా నిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడానికి బోలెడంత అవకాశం ఉన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి పార్లమెంటులో ఎంపీలను నోరెత్తి ప్రశ్నించాలని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ ప్రారంభమైంది. కేవలం తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఉన్న అవకాశాలను తోసిపుచ్చి, తానే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేల చేత సైతం శాసనసభను భహిష్కరింప చేస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలంటూ ఎలా చెప్పగలరని పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పోషిస్తున్న పాత్ర గురించి ఆ పార్టీ నేతలకు సైతం ఎలాంటి క్లారిటీ లేదని భావించాల్సి వస్తున్నదని విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రజలివ్వని హోదా కోసం మంకు పట్టు పడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత జగన్ తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు. తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేశామని చెబుతున్న వైసీపీ అధినేత జగన్.. ప్రజా సమస్యల పై గళమెత్తడానికి అసెంబ్లీకే వెళ్లాలా? అన్న వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ప్రెస్ మీట్లలోనే ప్రభుత్వ విధానాలను ఎండగడతానంటున్నారు. మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర హక్కులు, సమస్యలపై గళమెత్తాలని ఎంపీలను ఎలా ఆదేశిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర, హక్కులు, సమస్యలపై గళమెత్తడానికి అసెంబ్లీ కంటే, పార్లమెంటు ఎలా మెరుగైన వేదిక అవుతుందో జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టరు కానీ, ఆయన అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్ కు ఆయన పార్టీకీ రాష్ట్ర సమస్యలు పట్టవా? అని నిలదీస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను దుయ్యబడుతున్నారు. గత ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా, తమకు 40శాతం ఓట్లు వచ్చాయంటున్న జగన్.. మరి వైసీపీకి ఓటు వేసిన 40శాతం మంది ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ విధానాలను నిలదీయాల్సి ఉంది కదా? ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా పోరాడాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ ఏం జవాబు చెబుతారో చూడాల్సింది.
http://www.teluguone.com/news/content/avoid-assembly-and-attend-parliament-45-210320.html





