ముంజేతి కంకణానికి అద్దమెందుకు జగనన్నా?
Publish Date:Oct 3, 2022
Advertisement
ఏపీలో పాలన ఎంత దివ్యంగా సాగుతోందో తెలుసుకోవడానికి విపక్ష నేతల ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలనూ పట్టించుకోవలసిన అవసరం లేదు. జగన్ అధికారంలోకి వచ్చాకా ఎంతో ప్రేమతో ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ సిబ్బందిని అడిగితే చెబుతారు. ఒక ఉద్యోగం దొరకడమే దుర్లభంగా మారిన ఈ రోజుల్లో జగన్ సర్కార్ ఇంచక్కగా ఆర్టీసీ సిబ్బందికి రెండు ఉద్యోగాలు ఇచ్చేసింది. ఒకటి ఆర్టీసీలో డ్రైవర్/ కండక్టర్ ఉద్యోగమైతే.. రెండోది వాళ్ల వాళ్ల బస్సులు వెళ్లే దారిలో రహదారుల వేసుకునే ఉద్యోగం మరొకటి. మరి వేతనం సంగతి అంటారా? ఆ విషయం అడగొద్దు. ఒక ఉద్యోగానికి జీతం ఇవ్వడమే గగనంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రెండో ఉద్యోగం ఇవ్వడమే గొప్ప..దానికి వేతనం కూడా ఇవ్వాలా? అందుకే వేతనం సంగతి మరిచిపోయాం అంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. ఇక విషయానికి వస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లోనూ మనమే గెలుస్తాం.. గెలవాలి. ఇంత అద్భుతంగా పని చేస్తున్న మన ప్రభుత్వానికి కాకుండా ఇంకెవరికి ఓట్లేస్తారు అని పార్టీ నేలతను నిలదీస్తున్న జగన్ కు ఆయన పాలనలో రాష్ట్రం ఎంత వైభవంగా వెలిగిపోతోందో చెప్పడానికి రోడ్ల పరిస్థితి చాలు. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అన్నట్లుగా ఏపీ రోడ్లపై బస్సులు నడపడానికి ఆర్టీసీ సిబ్బంది పడుతున్న పాట్లు చూస్తే చాలు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం నియోజకవర్గం నాతవరం నుంచి తాండవ మధ్య రోడ్డుపై పల్లె వెలుగు బస్సు ప్రయాణాన్ని ప్రయాణీకులు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే చాలు. ఆ దారిలో వెళ్లే బస్సులను నడిపే డ్రైవర్, కండక్టర్లు ఎంత హ్యాపీగా తన విధులు నిర్వర్తిస్తున్నారో గమనిస్తే చాలు. బస్సు ముందుకు కదలాలంటే ఆ బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ లే దారి వేసుకోవాలి. రోడ్డు నిర్మించుకోవాలి. ఆ పనే చేస్తున్నారు. బండలను తెచ్చి రోడ్డు లెవెల్ చేసుకుని గుంటలను పూడ్చుకుని ముందుకు కదులుతున్నారు. ఆర్టీసీ సిబ్బందే రోడ్డు వేసుకుని మరీ బస్సు నడుపుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది. జగన్ పాలనలో ఏపీ వైభవాన్ని ఈ వీడియో కళ్లకు కడుతోందంటూ నెటిజన్లు తెగ ‘ప్రశంసలు’ కురిపించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్లనే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు స్వయంగా రోడ్లు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆయన ట్వీట్ లో ఘాటుగానే విమర్శించారు. మీ పరిపాలన వల్లనే ప్రజలు అంతా ఇలాంటి కష్టాలు పడుతున్నారని మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి మరి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇచ్చి తమను తాము డిఫెన్స్ చేసుకుంటారో చూడాలి.
http://www.teluguone.com/news/content/ap-roads-reflects-the-greatness-of-jagan-rule-39-144854.html





