ప్రశ్న రావణ్ హైదరాబాద్ నివాసంలో ఏపీ పోలీసుల సోదాలు.!
Publish Date:Jul 10, 2026
Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివాదాస్పద యూట్యూబర్ బత్తుల జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో ముందడుగు వేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు శుక్రవారం (జులై 10) సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ శివారు అమీన్‌పూర్ నరేంద్ర నగర్ కాలనీలో గత రెండేళ్లుగా ప్రశ్న రావణ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నివాసంలోనే గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన 8 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం (జులై 10) స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించింది. గంటల తరబడి సాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా సాగిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మొత్తం తనిఖీ ప్రక్రియ పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. సోదాలు ముగిసిన అనంతరం గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్ భార్యను విచారించారు. రావణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఆమెను ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, సమాజ శాంతికి భంగం కలిగించే అంశాలపై రావణ్‌పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ దర్యాప్తును వేగవంతం చేసే క్రమంలోనే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద గన్నవరం పోలీసులు ఇటీవలే ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నప్పటికీ, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించేందుకే ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు జరిపినట్లు చెబుతున్నారు. ఈ సోదాలలో స్వాధీనం చేసుకున్న ఈ కీలక డాక్యుమెంట్ల ఆధారంగా ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. prashna ravan news, ap police searches hyderabad, gannavaram police, bathula joseph updates, Telugu News
http://www.teluguone.com/news/content/ap-police-conduct-searches-at-prashna-ravanas-residence-in-hyderabad-36-225572.html





