ఆంధ్రప్రదేశా.. అత్యాచారాల ప్రదేశా?.. మహిళలపై పూటకో ఘోరం.. రోజుకో దారుణం
Publish Date:May 7, 2022
Advertisement
మహిళలకు ఇసుమంతైనా రక్షణ లేని పరిస్థితులు ఏపీలో నెలకొని ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశా, అత్యాచారాల ప్రదేశా అనే సందేహం ఏర్పడేలా పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే.. ఏపీలో మహిళలు భద్రతా, రక్షణా కరవై దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అరాచకత్వానికి చిరునామాగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ చట్టం అంటూ ఆర్బాటంగా సీఎం జగన్ చేసిన ప్రకటనలన్నీ కాగితం మూటలుగానే మిగిలిపోయాయి. ఒక దాని వెంట ఒకటిగా మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్న ప్రభుత్వంలో మాత్రం వాటిని అరికట్టేదిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. పైపైచ్చు అత్యాచార ఘటనలపై నిరసనలు వ్యక్తం చేస్తూ రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ మంత్రులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసే విషయంలో ఏ మాత్రం చొరవ చూపని పోలీసులు.. విపక్షాల ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంలో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. మహిళల రక్షణ విషయంలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని నిలదీసి ప్రశ్నించాల్సిన ఏపీ మహిళా కమిషన్ ప్రభుత్వం తరఫున వకల్తాపుచ్చుకోవడానికే పరిమితమైంది. బాధితులకు భరోసాగా నిలబడాల్సింది పోయి బాధితులకు అండగా ఉండేందుకు వచ్చిన వారికే నోటీసులు ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఇక పోలీసులైతే.. విచారణ లేకుండానే, వైద్య పరీక్షలు జరగకుండానే అత్యాచారం జరగలేదని ప్రకటించడం, నిందితులకు అనుకూలంగా మాట్లాడడానికే తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన విషయంలో సాక్షాత్తూ హోంమంత్రి నేరస్తులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడారు. మహిళా హోంమంత్రి అయ్యుండీ.. దొంగతనం కోసం వచ్చిన వాళ్లు అనుకోకుండా తోపులాట జరిగి అత్యాచారం చేశారని చెప్పడం ప్రభుత్వానికి మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై చర్యలు తీసుకునే ఉద్దేశమే లేదా అన్న అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి. మరో సంఘటనలో హత్యాచారానికి గురైన మహిళది ఆత్మహత్య అని చెప్పడానికి సదరు ఎస్పీ పడిన తాపత్రేయం దిగ్భ్రమ కలిగించక మానదు. మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం నివేదిక రాకున్నా..అత్యాచారం జరగలేదనీ, ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందనీ మీడియాకు చెప్పడం.. నిందితులను కాపాడటానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ప్రజా ప్రబుత్వం ఉందా అని అనుమానం కలిగేలా జగన్ సర్కార్ తీరు ఉంది.
http://www.teluguone.com/news/content/ap-not-safe-for-women-25-135568.html





