ఉత్సాహంగా ప్రారంభమైన ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్
Publish Date:Feb 24, 2026
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ శాసన వ్యవస్థ ఆటవిడుపు లో భాగంగా మూడురోజులపాటు నిర్వహించే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలు-2026 ను మంగళవారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజులు, జ్యోతి ప్రజ్వలన, స్పోర్ట్స్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్, అసెంబ్లీ ఫ్లాగ్ ల ఆవిష్కరణలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.... ఈ వేదిక కేవలం క్రీడాకారుల కోసం ఏర్పాటు చేయబడిందని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలు, పనులు, అసెంబ్లీ సమావేశాలతో ఒత్తిడి (టెన్షన్) ఉంటుందని, అటువంటి వారికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. 1983లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాప్రతినిధులు కోసం క్రీడా పోటీలను ప్రారంభించారని, ఆ సంప్రదాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో దాదాపు 78% మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి ఉత్సాహం ఈ పోటీలకు మరింత బలాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఈ పోటీలు కేవలం ప్రజాప్రతినిధులకే పరిమితం కాదని, ప్రజలు కూడా వచ్చి వీక్షించి తమ ప్రతినిధులను ప్రోత్సహించాలని కోరారు. తన చిన్నతనంలో వాలీబాల్ ఆడేవాడినని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన ఆటను చూసి రాజకీయాల్లోకి ఆహ్వానించిన.. తన పాత జ్ఞాపకాలను స్పీకర్ గుర్తు చేసుకున్నారు. క్రీడల ముగింపు రోజున (అసెంబ్లీ చివరి రోజు) ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని, ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు,బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని సభాపతి తెలిపారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ... గతంలో దివంగత ఎన్.టి.రామారావు హయాంలో ప్రారంభమై, మధ్యలో నిలిచిపోయిన ఈ క్రీడా సంప్రదాయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. రాజకీయ కార్యకలాపాలు, సభల వల్ల కలిగే పని ఒత్తిడి నుండి ప్రజా ప్రతినిధులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని , వికాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. పార్టీలు, వ్యక్తుల మధ్య ఉండే చిన్న చిన్న విభేదాలను మర్చిపోయి, అందరూ కలిసి మెలిసి ఉండటానికి ఇటువంటి కార్యక్రమాలు ఒక వేదికగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను, పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యతను మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర యువత, విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెరుగుతుందని, ఇది జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తయారు చేయడానికి నాంది కావాలని కోరారు. శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ... స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈసారి పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా శాప్ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి ప్రజాప్రతినిధులు అందరూ అధికారికంగా క్రీడా జ్యోతి ని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, డిప్యూటీ స్పీకర్ కే. రఘరామ కృష్ణం రాజు, ప్రభుత్వ విప్ లు జీవీ ఆంజనేయులు, పి. అనురాధ, శాప్ వీసీ మరియు ఎండీ ఎస్. భరణి ఇతర అధికారులు తెలియజేశారు.
http://www.teluguone.com/news/content/ap-legislators-sports-meet-36-214616.html





