ఎన్టీఆర్ వల్లే కాలేదు.. జగన్ ఫసక్కేనా? ఢీ..ఆర్సీ
Publish Date:Jan 20, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీ వ్యవహారం బాగా ముదిరిపోయి పాకాన పడుతోంది. మూడేళ్లుగా కక్కలేక మింగలేక ఉన్న కొన్ని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం మొదలెట్టాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల రుచి మరిగిన సాధారణ ప్రజలు కూడా ‘ధనాలు చెల్లినా.. దినాలు చెల్లడం లేద’నే అవగాహనకు వస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. అధికార వైసీపీకి నిన్న మొన్నటి వరకు బ్రహ్మరథం పట్టిన వివిధ వర్గాల్లోని అత్యధికులు జగన్ రెడ్డి సర్కారు పనితీరుపై అంతకంతకూ అసహనాన్ని, ఆగ్రహాన్ని పెంచుకుంటున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. రాజకీయంగా అందరికీ తెలిసిన ఒక విశ్లేషణ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉంటే కచ్చితంగా వారే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తున్నారనేది ఆ విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం నడిచిన 1983 ముందు కాలాన్ని కాసేపు పక్కన పెడదాం. ప్రజలు.. వారితో పాటు ఉద్యోగులు కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి, విరక్తి చెందిన తరుణంలో ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వెండితెరపై రాముడిలా, కృష్ణుడిలా వెలిగిపోయిన ఎన్టీఆర్ పార్టీ పెట్టడమే ఓ సంచలనం . అప్పటి వరకు తిరుగులేని అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరదించేశారాయన. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలలకే కాంగ్రెస్ కొమ్ములు విరిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్టీ రామారావుకు ప్రజల్లో ఉన్న ఆకర్షణ శక్తి ఓ కారణమైతే.. ఆనాటికి కాంగ్రెస్ ఏలుబడిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గూడుకట్టుకున్న విముఖత మరో కారణం. నందమూరి తారక రామారావుకు 1983 ఎన్నికల్లో ఘన విజయం కట్టబెట్టి ఆయనను తొలి కాంగ్రెసేతర సీఎంగా ప్రజలు ప్రభుత్వ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే.. కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఎన్టీఆర్ అఖండ విజయం పరిణామ క్రమంలో.. పరిణితి పరంపరలో ఉద్యోగుల పాత్రను, ప్రాధాన్యతను కూడా పరిగణనలోకి తీసుకోక తప్పదు.ఉద్యోగులు కూడా ఆనాడు కాంగ్రెస్ కు దూరంగా, ఎన్టీఆర్ కు అనుకూలంగా వ్యవహరించి ఆయనకు అఖండ విజయం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన విషయం మరిచిపోలేనిది. అయితే, సీఎం అయ్యాక ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు ఉద్యోగులకు ఇబ్బందిగా మారాయి. వెంటనే ఉద్యోగ సంఘాలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఆ విషయం గుర్తించిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు నచ్చజెప్పారు. ఉద్యోగులు ఎంత పవర్‌ఫుల్లో తెలిసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత కొన్ని నిర్ణయాల్లో వెనక్కి తగ్గి.. నెగ్గారు. రామారావు లాంటి వారే.. ఉద్యోగులను ఢీ కొట్టలేకపోయారని అంటారు. నిజానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఉద్యోగ వర్గాలు వ్యవహరిస్తాయనేది నిర్వివాదాంశం. బ్యాలెట్ పేపర్లు వినియోగించే రోజుల్లోనే కాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ వర్గాలే కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ విషయం 2014 లో.. 2019 లో జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అలాంటి ఉద్యోగ వర్గాలను జగన్ రెడ్డి సర్కార్ పీఆర్సీ విషయంలో మోసం చేసి గెలికిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. చరిత్రలో ఎక్కడా.. ఎప్పుడూ లేని విధంగా మధ్యంతర భృతి కంటే ఫిట్ మెంట్ తగ్గించిన వైసీపీ సర్కార్.. ఉద్యోగుల ఆశలపై పెద్ద దెబ్బే కొట్టింది. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని ఒక పక్క చెబుతూనే.. ఉద్యోగుల జీతాలు తగ్గడంలేదని మరో పక్కన సజ్జల, సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకే పాత పాట పాడుతున్నారు. సాకు ఏది చెప్పినా.. అల్టిమేట్ గా ఒక్కొక్కరికి కనీసం 6 వేలు నుంచి 7 వేల వరకూ నెలవారీ జీతంలో కోత పడుతుందని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీపై ఏకపక్ష జీఓలు ఇచ్చిన ప్రభుత్వంపై సమ్మె అస్త్రం ప్రయోగించాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. సర్కార్ తో ఇక చర్చల్లేవ్.. తగ్గేదే లే.. సమ్మె చేస్తామంటూ నోటీస్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఉద్యోగుల ఆగ్రహం ముందు జగన్ సర్కార్ సన్నాయి నొక్కులు పనిచేయడం లేదు. పీఆర్సీతో జీతాలు పెరగాలి కానీ తగ్గడమేంటని మండిపడుతున్నాయి. ఎన్జీఓ ఆఫీసు వద్ద పీఆర్సీ జీఓలను ఉద్యోగ వర్గాలు దగ్ధం చేశాయి. ‘కొత్త పీఆర్సీ వద్దు.. డీఏలతో కూడి 27 శాతం ఐఆర్ ఇస్తున్న పాత జీతమే ముద్దు’ అంటూ ఉద్యోగ సంఘాల కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించేందుకు రెడీ అవుతున్నాయి. ఐఆర్, హెచ్ఆర్ఏ తగ్గించి, జీతం పెరిగిందని చెబితే నమ్మేదుకు తాము ఏమైనా పిచ్చోళ్లమా అని ఫైరవుతున్నాయి. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. సర్కార్ చేసిన మోసంతో ఆగ్రహాన్ని తలకెక్కించుకున్న ఉద్యోగ వర్గాలు ఎన్నికలు వచ్చాక తమ తడాఖా ఏంటో చూపించి తీరుతాయనేది రాజకీయ విశ్లేషకుల హెచ్చరిక. ఈవీఎంలలో తేడాలు చేసే అవకాశం లేకపోయినా పోలింగ్ కేంద్రాల్లో గడబిడల విషయంలో ఉద్యోగ వర్గాల పాత్రను కొట్టిపడేయలేం అంటున్నారు. దాంతో పాటు ఉద్యోగుల కుటుంబాల ఓట్లు కూడా తక్కువేమీ ఉండవు. పార్టీల జయాపజయాలను నిర్ణయించే శాతం కొద్దిగా ఉండే ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల ఓట్లు చూపే ప్రభావం తక్కువేమీ ఉండదు. అలాంటి సందర్భాల్లో ఎన్నికల ఫలితాన్ని అవి శాసిస్తూ ఉంటాయనడంలో సందేహం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఫ్యాను గాలికి అనుకూలంగా వ్యవరించిన ఉద్యోగ వర్గాలు నిన్నమొన్నటి దాకా జగన్ సర్కార్ కు అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పీఆర్సీ కంటే మెరుగైన పీఆర్సీని జగన్ ఇస్తారని నిన్న మొన్నటి వరకు వారు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలన్నీ మొన్నటి పీఆర్సీతో నీరుగారిపోయాయి. ఉద్యోగులకు కొత్త పీర్సీతో గట్టి దెబ్బే తగిలింది. కొత్త పీఆర్సీలోని వాస్తవ పరిస్థితి అనుభవంలోకి వచ్చాక ఉద్యోగ వర్గాల కళ్లు ఎరుపెక్కాయి. ఇక ఇప్పుడు వైసీపీ సర్కార్ కు అసలు కథ మొదలైనట్టే అంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల నుండి వైసీపీకి, జగన్ సర్కార్ కు సానుకూల స్పందన వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీకి మరోసారి అధికార పీఠం దక్కే ఛాన్స్ లేకుండా ఉద్యోగవర్గాలు పరోక్షంగా కథ నడిపించవచ్చని అంటున్నారు. ఏదేమైనా ఈ పీఆర్సీ లొల్లి వచ్చే ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర ప్రభావం చూపడం తథ్యం కావచ్చు.. తస్మాత్ జాగ్రత్త..!
http://www.teluguone.com/news/content/ap-govt-employees-angry-on-prc-and-jagan-39-130447.html





