చంద్రబాబు ఇంటి నిర్మాణానికీ అనుమతులు ఇవ్వకపోతే...
Publish Date:Jun 17, 2015
Advertisement
ఆంద్ర,తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం నానాటికి మరింత తీవ్రతరం అవుతోందే తప్ప చల్లబడే సూచనలు కనబడటం లేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి జి.హెచ్.యం.సి.అనుమతులు ఇవ్వలేదు. హైదరాబాద్ లో సచివాలయ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లించనందునే చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఈయలేదని జి.హెచ్.యం.సి.కమీషనర్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దానిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాజధానిలో ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ తెలంగాణా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అయితే ఇక్కడ అచ్చెం నాయుడు కొన్ని విషయాల గురించి ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హైదరాబాద్ లో ఉన్న స్తిరాస్తులన్నీ తెలంగాణా ప్రభుత్వానికి చెందుతాయని వాదిస్తున్నప్పుడు, సచివాలయానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి? పదేళ్ళ పాటు హైదరాబాద్ నుండి పరిపాలన చేసుకొనేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఉంది కనుకనే దానికి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంతో సహా వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల కోసం హైదరాబాద్ లోనే అనేక భవనసముదాయాలు కేటాయించబడ్డాయనే సంగతి అందరికీ తెలుసు. పదేళ్ళపాటు వాటన్నిటినీ ఉపయోగించుకోదలిస్తే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి ఆస్తి పన్నులు అద్దెలు చెల్లించాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. నీళ్ళు, విద్యుత్, డ్రైనేజి, రోడ్లు వంటి ఇతర మౌలిక సదుపాయాలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందా లేదా అనేది విభజన చట్టంలో పేర్కొనబడిందో లేదో తెలియదు ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇటువంటివి అనేక సమస్యలు కనబడతాయి. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే ముందు హడావుడిగా అనేక లొసుగులతో కూడిన ఒక విభజన చట్టం తయారుచేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. అది చేసిన పొరపాట్లకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోవలసివస్తోంది. ఏది ఏమయినప్పటికీ ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోనీయకుండా ప్రభుత్వం ఈవిధంగా కక్షపూరితంగా వ్యవహరించడాన్ని ఎవరూ హర్షించరు. సాక్షాత్ ముఖ్యమంత్రికే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారో అనే అనుమానం తలెత్తడం సహజం.
http://www.teluguone.com/news/content/ap-cm-chandrababu-naidu-45-47496.html





