వాజ్ పేయి హయాం నాటి రోజులుగుర్తుకొస్తున్నాయి!.. ఏపీ అభివృద్ధి ఇక అన్ స్టాపబుల్!
Publish Date:Oct 25, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోంది. 1999లో వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉన్ననాటి పరిస్థితులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. కేంద్రంలో చంద్రబాబు మాటకు విలువ పెరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఇది కావాలీ అంటే.. అందుకు వెంటనే కేంద్రం మంజూరు చేస్తోంది. ప్రాజెక్టులు, నిధులు, కేటాయింపుల విషయంలో ఏపీకి అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అద్భుత పనితీరు కనబరిచారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపారు. అందుకు అప్పట్లో కేంద్రంలో వాజ్ పేయి నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి సర్కార్ సహకారం చాలా కీలకం అనడంలో సందేహం లేదు. అప్పట్లో ఎన్డీయే సర్కార్ కు తెలుగుదేశం పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ప్రభుత్వంలో చేరలేదు. అయితేనేం వాజ్ పేయి సంకీర్ణ సర్కార్ మనుగడ సాగించడంలో చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించారు. అందుకు ప్రతిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రగతికి, అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం పొందారు. అయితే 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. అయితే మోడీ నుంచి ఏపీకి వాజ్ పేయి హయాంలో అందిన సహకారం అందలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న వాగ్దానాన్ని మోడీ విస్మరించారు. కారణాలేమైతేనేం ఇప్పడు 2024 సార్వత్రికలో విజయం తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ ముచ్చటగా మూడో సారి కొలువుదీరిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోడీ సర్కార్ మనుగడకు తెలుగుదేశం మద్దతే కీలకంగా మారడంలో అనివార్యంగా మోడీ ఏపీ విషయంలో తన గత ధోరణిని మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును, 2024 జూన్ నుంచి కేంద్రం తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అప్పట్లో సిఎం హోదాలో చంద్రబాబు ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినా, ఎన్నిసార్లు అప్పాయింట్ మెంట్ కోరినా ఫలితం ఉండేది కాదు. చంద్రబాబును కలవడానికి మోడీ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు ప్రధాని మోడీ ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిస్థితిని సానుకూలంగా మార్చుకున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రం చేపట్టే ప్రాజెక్టులలో ఏపీకి అధికప్రయోజనం లభించేలా కేంద్రాన్ని ఒప్పిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలకమైేన రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. అమరావతి – హైదరాబాద్, చెన్నై – కోల్‌కతాలను అనుసంధానం చేసేలా నిర్మించనున్న రైల్వే లైన్ లో భాగంగా కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల పోడవైన వంతెన నిర్మాణాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు 2 వేల 245 కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా. ఇలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో చంద్రబాబు వినతులకు, ప్రతిపాదనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. అమరావతి, పోలవరం నిర్మాణాలకు కూడా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తున్నది. ఈ పరిస్థితి 1999లో వాజ్ పేయి సర్కాన్ అధికారంలో ఉన్న నాటి రోజులను గుర్తు చేస్తున్నది.
http://www.teluguone.com/news/content/andhrapradesh-progress-unstopable-39-187362.html





