జడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం: 26 జిల్లా పరిషత్ కు కైవసం.!
Publish Date:Nov 20, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత ప్రస్ఫుటమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితమైంది. స్థానిక సంస్థల అత్యున్నత వేదికలైన జిల్లా పరిషత్‌లపై కూటమి సాధించిన ఈ విజయంపై కూటమి పార్టీల్లో ఆనందోత్సాహలు వ్యక్తమతౌతున్నాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అత్యధిక స్థానాలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 22 జడ్పీ చైర్పర్సన్ పదవులతో పాటు 20 వైస్ చైర్పర్సన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక జనసేన జనసేన నాలుగు జడ్పీ చైర్పర్సన్ పదవులు, ఐదు వైస్ చైర్పర్సన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఒక జడ్పీ చైర్పర్సన్ పదవితో పాటు రెండు వైస్ చైర్పర్సన్ స్థానాలను గెలుచుకుంది. ఇక అల్లూరి సీతారామరాజు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ దక్కించుకుంది. పొత్తులో భాగంగా కొన్ని జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో సమీకరణాలు మారిపోయాయి. తొలి నుంచి ఆయా పదవులను ఆశించిన నాయకుల్లో కొంత అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా కాకినాడ, కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూటమి శ్రేణుల్లోని అసమ్మతి బయటపడింది. పదవుల కేటాయింపు విషయంలో నెలకొన్న మార్పులు కొన్ని చోట్ల చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని ఆశించిన కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి పొత్తు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఆ పదవి జనసేనకు వెళ్లడంతో ఆమెకు వైస్ చైర్పర్సన్ అవకాశం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే అసంతృప్తికి గురైన ఆమె ఎన్నిక ప్రక్రియకు హాజరుకావడానికి తొలుత నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీశ్ తదితరులు ఆమెతో మాట్లాడి బుజ్జగించినప్పటికీ, సమావేశ మందిరానికి వచ్చిన అనంతరం ఆమె ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు పంపన రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పదవుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్పర్సన్ పదవి వస్తుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిని నిరసిస్తూ కురుపాంలో బంద్ నిర్వహించారు. అనంతరం వీరేశ్ చంద్రదేవ్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కగా, ఆయన ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల స్థాయిలో పట్టు పెంచుకునే దిశగా జరిగిన ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిత్రపక్షాల మధ్య సమన్వయంతో మెజారిటీ జడ్పీలను చేజిక్కించుకోవడం కూటమికి సానుకూలాంశంగా మారింది. జిల్లా పరిషత్‌ల పాలకమండళ్లు పూర్తిస్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తాగునీరు, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జడ్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. మున్ముందు జడ్పీ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల అమలులో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తలెత్తిన అసంతృప్తులను సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గాలు ఏ మేరకు వేగంగా పనిచేస్తాయో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు: చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.! ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.!
[Andhra Pradesh Zilla Parishad Elections, Alliancevictory, ZP chairpersons, YCP, Alluri Sitarama Raju Zilla Parishad]
http://www.teluguone.com/news/content/andhra-pradesh-zilla-parishad-elections-25-237578.html




