పాక్ తో కాల్పుల విరమణలో మీ పాత్ర నిల్.. ట్రంప్ కు స్పష్టం చేసిన ప్రధాని మోడీ
Publish Date:Jun 18, 2025
Advertisement
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే చెప్పారు. ఎలాంటి శషబిషలూ లేకుండా ట్రంప్ కు భారత్ పాకిస్థాన్ ల మధ్య ఏ విషయమైనా ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని ఇందులో మూడో దేశం ప్రమేయానికి తావేలేదని తెగేసి చెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోన్ లో సంభాషించిన ప్రధాని భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర నిల్ అని స్పష్టం చేశారు. ట్రంప్ మోడీ ల మధ్య దాదాపు అరగంటకు పైగా సాగిన ఫోన్ సంభాషణలో మోడీ ఈ మేరకు ట్రంప్ కు స్పష్టత ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కావడానికి ముందు జరిగిన ఈ ఫోన్ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్ధావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడటం, అందుకు ప్రతిగా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం తెలిసిందే. ఆ దశలో హఠాత్తుగా ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం, అందుకు తానే కారణమంటూ ట్రంప్ చెప్పుకోవడం విదితమే. అయితే అప్పట్లోనే ట్రంప్ వ్యాఖ్యలను మోడీ నిర్ద్వంద్వంగా ఖండించారు. పాక్ బతిమలాడుకోవడం వల్లే కేవలం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మోడీ అప్పుడే చెప్పారు. అయినా ట్రంప్ పదే పదే తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమీ లేదని మోడీ ఆయనే స్పష్టంగా చెప్పారు. ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న విమర్శలకు తెరపడినట్టయింది.
http://www.teluguone.com/news/content/america-has-no-role-in-ceasefire-treaty-with-pakisthan-39-200231.html





