స్కూటర్‌పై డెడ్‌బాడీ.. అంబులెన్సు దందాతో దారుణం.. జగనన్న పోయే కాలం!
Publish Date:Apr 26, 2022
Advertisement
అంబులెన్స్ యూనియన్ డిమాండ్ చేసినంత సొమ్ము ఇచ్చుకోలేని ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని సొంతూరికి స్కూటర్ మీద తీసుకెళ్లిన హృదయవిదారక ఘటన మంగళవారం తిరుపతిలోని ప్రతిష్టాత్మక రుయా ఆసుపత్రి వద్ద జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా అరాచకత్వం తాండవిస్తోంది. అడిగేవారు లేరన్న ధీమాతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులకు నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనిపించేలా పరిస్థితి తయారైంది. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ ను మించిపోయాయా అన్న అనుమానం కలుగుతోంది. భూ మాఫియా, డ్రగ్ మాఫియాలా ఇప్పుడు రుయా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ మాఫియా నడుస్తోంది. ఇక్కడ అంబులెన్స్ యూనియన్లదే హవా. వారు చెప్పిందే వేదం. వారి మాటే శిలా శాసనం. కడప జిల్లా చిద్వేలుకుకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. ఆ బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు తండ్రి బయట నుంచి ఓ అంబులెన్స్ మాట్లాడుకుని తెచ్చుకున్నారు. అయితే ఆసుపత్రి వద్ద నడుస్తున్న అంబులెన్స్ మాఫియా అందుకు అంగీకరించలేదు. బయటి వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించేదే లేదంటూ అడ్డుకున్నారు. తామడిగినంతా చెల్లించి తాము చెప్పిన అంబులెన్స్ లోనే మృతదేహాన్ని తరలించాలని భీష్మించారు. దీంతో ఆ తండ్రి గత్యంతరం లేక, వారిడిగినంత ఇచ్చుకోలేక, కుమారుడి మృత దేహాన్ని తన స్కూటర్ పైనే సొంతూరికి తీసుకు వెళ్లాడు.
అంబులెన్స మాఫియా అమానుషత్వానికీ, అరాచకత్వానికి నిదర్శనంగా మంగళవారం రుయా ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న సంఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిపోతుంది.
రుయా ఆస్పత్రి వద్ద ప్రభుత్వ డ్రైవర్లు, మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు ప్రైవేటు అంబులెన్స్ యజమానుల కుమ్మక్కు దందా కారణంగా ఈ ఆసుపత్రి వద్ద అయిన వారి మృతదేహాలను తరలించడమన్నది సామాన్యులకు అందుబాటులో లేనంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.
ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన ప్రభుత్వ వైఫల్యమేనని నారా చంద్రబాబు అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఎంత అధోగతిలో ఉందో స్పష్టం చేస్తున్నదని చెప్పారు. ఇక లోకేష్ అయితే... రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ మండి పడ్డారు. ప్రభుత్వాసుపత్రులు అరాచకాలకు నిలయాలుగా మారిపోయాయని విమర్శించారు. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో యువతిపై సామూహిక అత్యచారం ఘటన మరవక ముందే తిరుపతిలోని ప్రభుత్వాసుపత్రి వద్ద అంబులెన్స్ దందా ఏమిటీ పరిస్థితి.. అసలీ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ మండిపడ్డారు. అసమర్ధ పాలకుడి చేతిలో రాష్ట్రం అరాచకాలకు నిలయంగా మారిపోయిందని విమర్శించారు.
http://www.teluguone.com/news/content/ambulance-mafia-dead-body-on-scooter-25-135007.html





