అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
Publish Date:Jul 20, 2025
Advertisement
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా జులై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి మండలం రెంటపాళల్లో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పోలీసులు పరిమిత వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.అయితే పరిమితి దాటి పోవడంతో కొర్రపాడు వద్ద పోలీసులు బారికేడ్డు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అంబటి, తన సోదరుడు మురళి, కార్యకర్తలు బారికేడ్ల వద్ద ఉన్న పోలీసులను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను తోసేసి పోలీసులను నెట్టివేశారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
http://www.teluguone.com/news/content/ambati-rambabu-39-202322.html





