రాజధాని స్వప్నం.. అలు పెరగని పోరాటం! అమరావతి@500
Publish Date:Apr 29, 2021
Advertisement
అమరావతి.. నవ్యాంధ్ర కలల రాజధాని.. అది నగరం కాదు.. భూతల స్వర్గం.. చంద్రబాబు స్వప్నం.. ఆంధ్రుల నిండు గౌరవం.. ఎవరి దిష్టి తగిలిందో.. ఎవరి కళ్లు పడ్డాయో.. ఆ సుందర స్వప్నం చెదిరి పోయింది.. ఆ కలల సౌధం కుప్పకూలిపోయింది.. మూడు ముక్కలై.. ఓ ముక్కగా మూలన పడింది.. ఒక్క ఛాన్స్ అంటూ అందల మెక్కాడు.. అమరావతిపై భస్మాసుర హస్తం మోపాడు.. ఇక అంతే.. అమరావతి సర్వ నాశనం.. తమ కలల రాజధాని.. మూడు ముక్కలై.. మోడు పోవడంతో.. అమరావతి రైతులు భగ్గుమన్నారు.. ఉద్యమంతో ఉప్పెనలా విరుచుకుపడ్డారు.. దీక్షలతో జగన్‌పై దండయాత్ర చేశారు.. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు CM జగన్. ఆ క్షణమే అమరావతి ఉద్యమం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు.. అమరావతి ఉద్యమంలో ప్రతిదీ ఒక చారిత్రక ఘట్టమే... వంటిపై లాఠీలు విరిగినా వెనక్కు తగ్గలేదు... వరుసగా ప్రాణాలు పోతున్నా లెక్క చేయలేదు... 29 గ్రామాల రైతులు తొలిరోజు నుంచి అదే ధైర్యంతో 500 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు... పోరు మహోగ్రంగా మారుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు... తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, నవులురూ.. కృష్ణాయపాలెం, తాడికొండ అడ్డరోడ్డు ఇలా 29 గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ చూసినా ఒకటే మాట.. మన రాజధాని-మన అమరావతి..... 5 కోట్ల మంది ప్రజల గొంతుక 500 రోజులుగా ప్రతిధ్వనిస్తోంది.. రాజధాని కోసం అనేక రూపాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు... జలదీక్షలు చేశారు... అర్థనగ్నంగా ప్రదర్శనలు చేశారు... మోకాళ్లపై నడిచారు... రాజధాని వీధుల్లో కదం తొక్కి ర్యాలీలూ చేశారు... దేవుళ్లకు మొక్కారు... ముడుపులు కట్టారు... అల్లానూ ప్రార్థించారు... ఏసు ఆశీస్సులనూ కోరారు... తమకు నామాలు పెట్టిన వాళ్ల బుద్ధి మారాలంటూ హోమాలు చేశారు... ఏ రీతిన తమ ఆకాంక్ష తెలియచేసినా అంతా శాంతిమంత్రమే... అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు నిరసన బాట పట్టి కేసులతో జైళ్ళకు కుడా వెళ్లారు. ఒక్క రాజధాని ప్రాంతంలోనే 600 మందికి పైగా రైతులను అరెస్టు చేసి కోర్టు బోను ఎక్కించారు. ఇది కృత్రిమ ఉద్యమం ఎంతమాత్రం కాదు..... ఇది పెయిడ్ ఆర్టిస్టుల పోరాటం అంతకంటే కాదు...కరోనా విజృంభణతో.. సామూహిక దీక్షలకు బ్రేక్ పడినా.. విడతల వారీగా ప్రతిరోజూ రైతులు పరిమిత సంఖ్యలో భౌతికదూరం పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమరావతి నినాదాన్ని గొంతెత్తి చాటుతూనే ఉన్నారు. అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు కూడా సంపూర్ణ మద్దతు పలికారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానుల కాన్సెప్ట్ సక్సెస్ కాలేదనేది NRIల మాట. తెలుగుదేశం హయాంలో 2014 సెప్టెంబర్ 1న కేబినెట్ తీర్మానం చేశారు. 2015 అక్టోబర్‌లో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేశారు. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి ప్లాన్ సిద్ధమయ్యాక పనులు పరుగులు పెట్టాయి. ఒక్కో భవనం పైకి లేచింది. సింగపూర్ సంస్థలూ రంగంలోకి దిగాయి. వేల మంది కార్మికులు రేయింబవళ్లు పని చేస్తుంటే.. విద్యుత్ వెలుగుల్లో అమరపురి వెలిగిపోయింది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆ వెలుగులన్నీ ఆరిపోయాయి. YCP అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి భవిష్యత్ అగమ్య గోచరమైంది. నమ్మించి గొంతు కోశారు. అధికారంలోకి రాగానే విధ్వంసానికి తెర తీశారు. అమరావతి సాక్షిగా చేసిన చట్టాలనే రద్దు చేసి వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనకు విశాఖ, కర్నూలు వాసుల నుంచి పూర్తి మద్దతు లేకపోయినా బలవంతంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగుల పేరుతో చేసిన వృధా 2,600 కోట్లు పెడితే అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు కొలిక్కి వచ్చేవి. పాలన మరింత సమర్థంగా జరిగే వీలుండేది. YCPసర్కారు 3 ముక్కలాటకు తెరతీసిన నాటి నుంచి 500 రోజులుగా రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులకు కడుపు నిండా తిండిలేదు. కంటి నిండా నిద్రలేదు. రాజధానికి భూములిచ్చిన వారిలో 29 వేల 881 మంది ఉన్నారు. ఇందులో ఎకరం లోపు ఇచ్చిన చిన్నరైతులే 20 వేల మంది. వీరిలో బీసీలు, దళితులే ఎక్కువ. ఈ పేద రైతులంతా కన్నీళ్లు పెడుతున్నారు. తమను ఏడిపించి జగన్ సర్కారు ఏం సాధిస్తుందని ప్రశ్నిస్తున్నారు. న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ మినహా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. 13 జిల్లాల్లోనూ అమరావతికి మద్దతుగా దీక్షలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా లోకేష్, ఇతర రాజకీయ పార్టీలన్నీ రాజధాని రైతులకు బాసటగా నిలిచాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినాయకులు అమరావతి ప్రాంత రైతులను పరామర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతుల కోసం జోలె పట్టుకుని బిక్షాటన చేశారు. ఆయన భార్య భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ప్రకటించడం వంటి ఘటనలు అమరావతి ఉద్యమంలో ముఖ్య ఘట్టాలు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకం సందర్భం వచ్చిన ప్రతిసారీ అమరావతి వైపే నిలబడుతున్నా.. కుట్రలు, పోలీసు బలగాలతో ఉద్యమంపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. 29 గ్రామాల ప్రజలు చేసి తప్పేంటి..? ఆంధ్రులకు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఉండాలని ఆకాంక్షించడం తప్పా? ల్యాండ్ పూలింగ్‌లో అడిగిన వెంటనే భూములు ఇవ్వడం నేరమా. దశల వారీగా రాజధాని నిర్మించుకోవడానికి ఇబ్బందేంటి.. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ ఏ YCP నాయకుడి దగ్గరా సమాధానం ఉండదు. అందుకే, సీఎం జగన్ కనిపించినా, స్థానిక ఎమ్మెల్యే RK కనిపించినా.. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఓటు వేసి గెలిపించినందుకు తమను ఎందుకు మోసం చేశారని కడుపుమంటతో రగిలిపోతుంటారు రైతులు, మహిళలు. రాజధానిపై సామాజిక వర్గం ముద్ర వేయడం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం.. ఖర్చు ఎక్కువంటూ ప్రచారం చేయడం.. ఇలా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు అధికార పార్టీ నేతలు. వీటన్నింటినీ తిప్పికొడుతూనే ఉద్యమాన్ని వినూత్న రీతుల్లో ముందుకు తీసుకెళ్లారు అమరావతివాసులు. మహిళలైతే ఉద్యమంలో మొదట్నుంచి కీలకమైన పాత్ర పోషించారు. ఈ మహిళా శక్తి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. సాక్షాత్తూ ప్రధానే అమరావతికి శంకుస్థాపన చేశారు. చేయూత ఇస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో మాస్టర్ ప్లాన్ మొత్తం సిద్ధమై నిర్మాణాలు చకచకా మొదలయ్యాయి. ఓ పక్క ప్రభుత్వ కాంప్లెస్‌లు సిద్ధమవుతుంటే.. SRM, విట్ లాంటి ఎన్నో సంస్థలు తరలివచ్చాయి. విశ్వనగరానికి పునాదులు పడి వడివడిగా ముందుకు సాగుతున్న టైమ్‌లో.. అధికారమార్పిడితో మొత్తం తలకిందులైంది. అమరావతిని భ్రమరావతి అని నిరూపించాలనుకుని ప్రయత్నం చేసిన వారు.. వస్తూనే విధ్వంసానికి తెరతీశారు. దీన్ని సరిదిద్దాలంటూ 500 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ప్రస్తుతం అమరావతిలో సాగుతున్న పోరాటం 29 గ్రామాలకు సంబంధించింది ఎంత మాత్రం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్. అందుకే.. అమరావతి నినాదం రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతిచోటా మార్మోగుతోంది. కొవిడ్ కారణంగాను, కోర్టు తీర్పుల వల్లా ప్రస్తుతానికి రాజధాని తరలింపు ఆగింది. ఇది తాత్కాలికంగా ఆగడం కాదు శాశ్వతంగా అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ విశ్రమించేది లేదంటున్నారు అమరావతి ప్రజలు. అందుకే, 500 రోజులుగా ఉద్యమిస్తున్నారు. తమ పోరాటం ఇక్కడితో ఆగిపోదు.. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా లక్ష్యం చేరుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లేదంటున్నారు. ఉద్యమమే ఊపిరైతే.. రేపటి తరాల బంగారు భవిష్యత్తే నీ లక్ష్యమైతే.. ఆ స్ఫూర్తిని ఆపేదెవరు. ఆ ఆశయానికి అడ్డు తగిలేదెవరు. నియంతల్లా మారిన పాలకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా సరే.. ఆ ఉక్కు సంకల్పం గెలిచే తీరుతుంది. ఈ తథాగతుడి సాక్షిగా.. ఆ గౌతమబుద్ధుడు బోధించిన అహింసా సిద్ధాంతమే ఆయుధంగా.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే అవుతుంది. ప్రజా ఉద్యమానికి ఎలాంటి పాలకులైనా తలవంచాల్సిందే. న్యాయం, ధర్మం గెలవాల్సిందే. అమరావతి పోరాటం విజయం సాధించాల్సిందే. ఇప్పటికే రెండేళ్లుగా ఉద్యమిస్తున్నారు. మరో మూడేళ్లైనా ఇలానే పోరాడే సత్తా, సత్తువ, సాహసం ఉంది. అప్పటికి మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈసారి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకపోతారా.. అమరావతి స్వప్నం సాకారం కాకపోతుందా.. అనే ఆశతోనే, పట్టు వదలని సంకల్పంతో పోరాడుతున్నారు అమరావతివాసులు. వారి ఆకాంక్ష తప్పక నెరవేరాలని కోరుకుంటూ.. జై అమరావతి.. జైజై అమరావతి.
http://www.teluguone.com/news/content/amaravathi-farmers-protest-500-days-39-114556.html





