విభజన సమస్యల పరిష్కారానికి ఏకె సింగ్ నోడల్ అధికారి
Publish Date:Mar 19, 2015
Advertisement
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న అనేక సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని, అందుకోసం ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చిరకాలంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అదేవిధంగా మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెదేపా, బీజేపీ యంపీలు, కేంద్రమంత్రులు అందరూ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి మళ్ళీ ఇదే విషయాన్ని మరొక్కమారు ఆయన దృష్టికి తీసుకురావడంతో ఆయన తక్షణమే స్పందించి హోంశాఖకు హోంశాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ.కె. సింగ్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన ఈరోజు హైదరాబాద్ వచ్చి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం అవుతారు. విభజన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల గురించి వారితో చర్చిస్తారు. ఆ తరువాత వాటి గురించి కేంద్ర హోంమంత్రికి క్లుప్తంగా ఒక నివేదిక సమర్పించి ఆయన ఆదేశానుసారం వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారు. ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొంది కనుక క్రమంగా ఒక్కొక్కటీ పరిష్కారం అవుతాయని ఆశిస్తూ ఎదురుచూడవలసిందే. అయితే ఈ సమస్యలకు కేవలం ఆర్ధిక, సాంకేతిక కారణమయి ఉండి ఉంటే అవన్నీ ఈపాటికి పరిష్కారం అయ్యుండేవి. కానీ వాటి వెనుక ఉన్న రాజకీయ కారణాల వలన సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. తెదేపా, తెరాస పార్టీల మధ్య, వాటి అధినేతల మధ్య ఉన్న రాజకీయ వైరం, భేషజాలు తొలిగితే తప్ప సమస్యల పరిష్కారం సాధ్యం కాకపోవచ్చును. కానీ ఎక్కడో ఒకచోట ఎప్పుడో అప్పుడు ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది కనుక కేంద్రం చొరవ తీసుకొంది.
http://www.teluguone.com/news/content/ak-singh-39-44276.html





