అదానీ పరమైన గంగవరం పోర్టు
Publish Date:May 25, 2021
Advertisement
విశాఖ గంగవరం పోర్టు అదానీ గ్రూప్ వశమైంది. గంగవరం పోర్టులోని మెజారిటీ వాటాను దక్కించుకున్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎ్‌సఈజెడ్).. ఇప్పుడా పోర్టును తమ సంస్థలో విలీనం చేసుకోనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.10 శాతం, విండీ లేక్ సైడ్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్‌కు 31.15 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. డీవీఎస్ రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. దీంతోగంగవరం పోర్టు లిమిటెడ్‌లో 89.6 శాతం వాటా అదానీల చేతికి వచ్చినట్లైంది. గంగవరం పోర్టులోని మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును పూర్తిగా అదానీ గ్రూప్ సొంతం చేసుకునేందుకు ఏపీ సెజ్ ప్రతిపాదించింది. స్పందించిన ప్రభుత్వం వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పోర్టును ఏపీ సెజ్‌లో విలీనానికి కూడా అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటి నివేదిక తర్వాత... ఏపీ వాటా కూడా కొనుగోలు చేసి గంగవరం పోర్టును పూర్తిగా సొంతం చేసుకోనుంది అదానీ గ్రూప్ గంగవరం పోర్టు చెల్లించిన మూలధనం రూ.51.7 కోట్లు. ఇందులో 58.1వాటా డీవీఎస్ రాజు, ఆయన కుటుంబం, 31.5 శాతం వాటా వార్బర్గ్ పింకస్ చేతిలో ఉంది. మిగిలిన 10.4వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. మార్చి 3న గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను అమెరికా పీఈ కంపెనీ వార్బర్గ్ పింకస్ నుంచి కొనుగోలు చేసిందిఅదానీ పోర్ట్స్. తర్వాత 58.1 శాతం వాటాను ప్రమోటర్లు డీవీఎస్ రాజు, ఆయన కుటుంబం నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.3,604 కోట్లు వెచ్చించింది. ఒక్కో షేరుకు రూ.120 చెల్లించి వార్బర్గ్ పింకస్ నుంచి 31.5 శాతం వాటాను అదానీ పోర్టు కొనుగోలు చేసింది. అదే ధరకు డీవీఎస్ రాజు, ఆయన కుటుంబం నుంచి 30 కోట్ల షేర్లను (58.1) సొంతం చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పశ్చిమ తీరప్రాంత కంపెనీగానే పరిమితం కాకుండా.. దేశ వ్యాప్త కార్గో యుటిలిటీ కంపెనీగా ఎదగాలని అదానీ పోర్ట్సు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే గంగవరం పోర్టును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు అదానీల చేతిలో ఉంది. తాజాగా గంగవరం పోర్టు కూడా సొంతం అయింది. ఈ రెండు పోర్టులతో కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తోంది. దాదాపు రూ.12,000 కోట్లకు కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2025 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకోవాలన్నది అదానీ పోర్ట్సు లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా తీరంలో విశాఖపట్నం పోర్టుకు తర్వాత వ్యూహాత్మకంగా గంగవరం పోర్టు ఉంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నాన్- మేజర్ పోర్టు. ప్రస్తుతం 9 బెర్త్‌లతో పని చేస్తున్న పోర్టు స్థాపిత సామర్థ్యం 64 ఎంఎంటీ (మిలియన్ మెట్రిక్ టన్నులు). అన్ని వాతావరణ పరిస్థితుల్లో కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యంతోపాటు డీప్ వాటర్, మల్టీపర్పస్ ఓడరేవు ఇది. 2 లక్షల డెడ్‌వెయిటేజ్ టన్నుల (డీడబ్ల్యూటీ) నౌకలు కూడా పోర్టులోకి వచ్చే సదుపాయం ఉంది. 1,800 ఎకరాల స్థలం కలిగిన ఈ పోర్టును 250 ఎంఎంటీపీఏ సామర్థ్యానికి పెంచాలన్నది అసలు ప్రణాళిక. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి. బాక్సైట్, చక్కెర, అల్యూమినా, ఉక్కు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. తూర్పు, దక్షిణ, మధ్య భారత ప్రాంతాల్లోని ఎనిమిదికి పైగా రాష్ట్రాలకు ఇది ఇంటర్‌ల్యాండ్ గేట్ వే పోర్టు.
http://www.teluguone.com/news/content/adani-group-taken-over-gangavaram-port-39-116240.html





