లంచం కొట్టు.. ఉద్యోగం పట్టు.. కట్ చేస్తే, ఏసీబీ కేసు..
Publish Date:May 31, 2021
Advertisement
శవం మీద కాసులు ఏరుకోవడం అంటే ఇదే. అనారోగ్యంతో ఆ చిరు ఉద్యోగి చనిపోయింది. ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. మృతురాలి భర్తకైనా ఆ ఉద్యోగం ఇస్తే కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందని అనుకున్నారు. ఉద్యోగం కోసం పైఅధికారిని సంప్రదించారు. చనిపోయిందనే కనికరం కూడా లేకుండా.. ఆ ఉన్నతోద్యోగి లంచం డిమాండ్ చేసింది. కట్ చేస్తే.. ఏసీబీకి దొరికిపోయి పరువు పోగొట్టుకుంది. ఈమధ్య ఏసీబీ దాడి కేసులు చాలా తక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడన్నీ కరోనా కేసులే. తాజాగా, కరోనా కాలంలో జీహెచ్ఎమ్‌సీలో ఏసీబీ కేసు నమోదవడం కలకలం రేపింది. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న స్వీపర్ సాలెమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమె ఉద్యోగం అతని భర్త రాములుకు వచ్చింది. రాములుకు ఆ ఉద్యోగం ఇచ్చినందుకు తనకు 20వేలు లంచం ఇవ్వాలని డీఈ మహాలక్ష్మి డిమాండ్ చేశారు. తమది పేద కుటుంబం.. అంత సొమ్ము ఇచ్చుకోలేమని చెప్పినా ఆమె వినలేదు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కి వచ్చి తన అసిస్టెంట్ విజయ్‌కు లంచం అమౌంట్ ఇవ్వాలని ఆర్డర్ వేసింది డీఈ మహాలక్ష్మీ. విషయం రాములు కొడుక్కి తెలిసింది. అతను కాస్త తెలివైన వాడిలా ఉన్నాడు. తన తండ్రిని లంచం అడిగిన మేటర్ ఏసీబీ అధికారులకు చేరవేశాడు. అంతా కలిసి డీఈని ట్రాప్ చేశారు. ఓ హోటల్‌లో డీఈ అసిస్టెంట్ విజయ్‌కు డబ్బులు ఇస్తుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అతన్ని విచారించగా డీఈ మహాలక్ష్మి తీసుకోమంటేనే తాను ఆ డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. డీఈ మహాలక్ష్మి ఇంట్లో తనిఖీలు చేశారు. లెక్కకు మించి నగదు.. బంగారం గుర్తించినట్టు తెలుస్తోంది. చనిపోయిన స్వీపర్ విషయంలో జాలి చూపించకుండా.. మృతురాలి భర్తకు ఉద్యోగం ఇవ్వడానికి 20వేలు డిమాండ్ చేసి.. అడ్డంగా దొరికిపోయిన డీఈ మహాలక్ష్మి ఉదంతం.. జీహెచ్ఎమ్‌సీ సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది.
http://www.teluguone.com/news/content/acb-rides-on-ghmc-employee-25-116642.html





