12 పెళ్లిళ్ల నిత్య పెళ్లి కూతురు అంటూ ఫిర్యాదు.. నిరూపించమంటూ నీలిమ సవాల్!
Publish Date:Jun 24, 2025

Advertisement
ఎప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో నిత్యపెళ్లి కొడుకు క్యారెక్టర్ ను చూశాం. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ పోయే అలాంటి నిత్యపెళ్లికొడుకులకు సంబంధించి వార్తలు మీడియాలో విన్నాం. కన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నిత్య పెళ్లికూతురి గురించి. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ విడాకులు పొంది, ఆర్థికంగా స్థితిమంతులైన మగవారిని టార్గెట్ చేసుకుని వల విసిరి పెళ్లి చేసుకుంటుంది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ తన తల్లి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ ల సహకారంతో విడాకులు తీసుకుని డిప్రషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుంటుంది. ఇక అలా డిప్రషన్ లో ఉన్న వారు ఆర్థికంగా స్థితిమంతులైతే వారిని వదలదు. వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటుంది. కొంత కాలం తరువాత.. వారి నుంచి అందినంత సొమ్ము లాగేస్తుంది. ఇదీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్య పెళ్లి కూతురు నీలిమపై కొంతమంది బాధితులు సోమవారం (జూన్ 23) గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదు. అయితే నీలిమ తాను అటువంటిది దానిని కాదనీ, తాను ఎక్కడ 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానో నిరూపించాలని సవాల్ చేస్తోంది. ఇపుడు వాస్తవం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
ఆర్థిక స్థోమత ఉండి, విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని పెళ్ళి పేరుతో మోసం చేస్తోందంటూ, నీలిమపై కొంతమంది బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నీలిమ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయి ఉంది. నీలిమ కు సహకరిస్తున్న ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, మద్దాల శ్రీను, కళ్యాణ్, దుర్గ అనే వ్యక్తులపై ఇప్పటికే పాలకొల్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి, శ్రీను, కళ్యాణ్, దుర్గలు ఒక ముఠా గా ఏర్పడి పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం ఎత్తి భార్యా బాధితులను వలలో వేసుకుని మోసానికి పాల్పడుతున్నట్లు నీలిమపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వార్త మీడియాలో రావడంతో నీలిమ కూడా మీడియా ముందుకు వచ్చి తాను 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానడం తప్పు అని ఖండించింది. ఈ పెళ్ళిళ్ళను నిరూపించకపోతే దీనిపై తాను ఎంత దూరమైనా వెళతానని నీలిమ హెచ్చరించింది. మరో ప్రక్క విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి నీలిమ వారిని వివాహం చేసుకుని డబ్బు దండుకుని మాయం అవుతోందని బాధితులు వాపోతున్నారు.
ఎవరైనా తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు కు చెందిన బాధితులు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో తమకు జరిగిన మోసాన్ని వివరించి, నీలిమ దోచుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఒకరు 50 లక్షలు ఇచ్చి మోసపోగా, మరొకరు 15లక్షలు ఇచ్చి మోసపోయామని పేర్కొంటున్నారు. దీనిలో ఎవరి ఫిర్యాదు కరెక్ట్ అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/12marriages-nityapellikuthuru-39-200562.html












