తమిళనాడులో టెన్త్ ఉత్తీర్ణత 90 శాతం.. అక్కడ కరోనా లేదా జగన్ గారూ!
Publish Date:Jun 21, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ డొల్ల తనం తమిళనాడు టెన్త్ పరీక్షా ఫలితాల విడుదలతో మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో టెన్త్ రిజల్ట్స్ విడుదల చేశారు. అక్కడ ఉత్తీర్ణత 90 శాతం. ఏపీలో టెన్త్ రిజల్ట్స్ లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా నమోదవ్వడంతో విమర్శలు వెల్లువెత్తిన సందర్భంగా ఏపీ ప్రభుత్వం కరోనా కారణంగా విద్యార్థులు చదువులకు దూరం అయ్యారనీ, ఆ కారణంగానే కరోనా ముప్పు బయటపడిన తరువాత తొలిసారిగా జరిగిన పరీక్షలు కావడంతో ఉత్తీర్ణతా శాతం తక్కువగా వచ్చిందనీ సమర్ధించుకుంది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించడం వల్లలే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయన్న విమర్శలను కొట్టి పారేసింది. ఇప్పుడు తమిళనాడులో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 90 శాతం మంది ఉత్తీర్ణులు కావడంతో ఏపీలో ఉత్తీర్ణతా శాతం తగ్గుదల అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వ విధానాలు, వైఫల్యం వల్లనే టెన్త్ లో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలలో వాస్తవం ఉందని తమిళనాడు టెన్త్ రిజల్ట్స్ ను ఉదాహరణగా చూపుతున్నారు. తమిళనాడులో కరోనా లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ సోమవారం విడుదలయ్యాయి. అక్కడ టెన్త్ లో90 శాతం, ఇంటర్ లో 93శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అక్కడ కూడా కరోనా కారణంగా గత రెండేళ్లూ పరీక్షలు జరగలేదు. అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడేందుకు కరోనా సమయంలో కూడా తమిళనాడు ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. టెన్త్ లో ఉత్తీర్ణతా శాతం తగ్గడం అసాధరణం కాదని అంటోంది. నెపం కరోనాపై నెట్టేసి చేతులు దులుపుకుంటోంది. అయితే అసలు వాస్తవం విద్యా సంస్థల్లో టీచర్లు లేకపోవడమేనని, ప్రభుత్వం టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడమేనని విపక్షాలే కాదు విద్యారంగ నిపుణులు కూడా విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. తమిళనాడు కాదు.. అంటే ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ ఎంతో మెరుగు అంటూ చెప్పుకుంటోంది. ప్రభుత్వ తీరు విద్యార్థుల బవితను నాశనం చేసేదిగా ఉందంటూ విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ లో ఉత్తీర్ణత గణనీయంగా తగ్గిపోవడానికి కారణాలను గుర్తించి, తన తప్పిదాలను అంగీకరించి, భవిష్యత్ లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.
http://www.teluguone.com/news/content/10th-pass-percentage-90-in--tamilanadu--is-there-no-corona--25-138098.html





