లగడపాటి, వంగవీటి రాధా భేటీ.. ఏపీలో హాట్ టాపిక్
Publish Date:Mar 6, 2019
Advertisement
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళవారం సాయంత్రం విజయవాడలో సమావేశమయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటుని ఆశించిన వంగవీటి రాధా ఆ తరువాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి రాజీనామా చేసారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు. మరోవైపు రాధా టీడీపీలో చేరతారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన తన అనుచరులు, సన్నిహితులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే మధ్యలో కొద్దిరోజులు సైలెంట్ అయిన రాధా పేరు.. ఇప్పుడు లగడపాటితో భేటీ కావడంతో మళ్ళీ తెరమీదకు వచ్చింది. అదికూడా లగడపాటి.. టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో భేటీ అయిన కాసేపటికే రాధాతో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ తరపున రాయబారానికే లగడపాటి, రాధాతో భేటీ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/-vangaveeti-radha-meets-lagadapati-rajagopal-39-86150.html





