తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు...ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Publish Date:Apr 14, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది. సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం తొమ్మిది గంటల నుండే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి రహదారులన్నీ జన సంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 42 డిగ్రీల మార్కును దాటేశాయి. గాలిలో తేమ తగ్గిపోయి, పొడి వాతావరణం ఏర్పడటంతో సెగలు గక్కుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, చిరు వ్యాపారులు ఈ అకాల ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి ప్రతాపానికి సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాల్లో 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, రానున్న రెండు రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేడి గాలుల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున, వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఇంటి పట్టునే ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా ఒక్కసారిగా పెరిగింది. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో గ్రిడ్లపై ఒత్తిడి పెరుగుతోంది. అటు పశుగ్రాసం కొరత, మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని పశుపోషకులు కోరుతున్నారు. పల్లెల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే గురువారం నుంచి ఎండలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ప్రయాణాలు చేయవద్దని, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
http://www.teluguone.com/news/content/-telangana-heatwaves-36-217348.html





