రాత్రంతా ఏడ్చాను..ఆ సమయంలో సువేందు నన్ను ఓదార్చారు : మహువా మోయిత్రా
Publish Date:Jun 24, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అత్యంత కీలక నేతలుగా ఉండి, ప్రస్తుతం పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఉన్న పాత బంధం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత సువేందు అధికారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మహువా మోయిత్రా తన రాజకీయ జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తాను పడిన మానసిక వేదనను ఆమె పంచుకున్నారు. ఆ సమయంలో టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై, రాత్రంతా ఏడ్చానని, ఆ కష్టకాలంలో తనకు వెన్నుముకగా నిలిచి ఓదార్చిన ఏకైక వ్యక్తి శుభేందు అధికారి మాత్రమేనని మహువా సంచలన నిజాలను వెల్లడించారు. రాజకీయంగా ఇప్పుడు విభిన్న ధృవాలుగా విడిపోయినప్పటికీ, సువేందు అధికారితో తనకు ఇప్పటికీ ఒక బలమైన 'ఎమోషనల్ కనెక్షన్' ఉందని ఆమె స్పష్టం చేశారు. తన తొలి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కరీంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు టీఎంసీలోని ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా తన కోసం ప్రచారం చేయడానికి రాలేదని మహువా పేర్కొన్నారు. కానీ ఆ రోజుల్లో పార్టీలో నెంబర్ టు స్థానంలో ఉన్న శుభేందు అధికారి స్వయంగా వచ్చి తన తరఫున మొదటి ఎన్నికల ర్యాలీలో పాల్గొని మద్దతుగా నిలిచారని చెప్పారు. నేటికీ ఆనాటి ఫోటోలు చూస్తే అందులో కేవలం తను, సువేందు మాత్రమే కనిపిస్తారని ఆమె గుర్తుచేశారు. 2020లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో వచ్చిన విభేదాల వల్ల శుభేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లో వరుసగా రెండుసార్లు ఓడించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం బెంగాల్ సీఎం పీఠంపై ఉన్న శుభేందుతో తనకు ఇప్పుడు నిరంతర సంభాషణలు లేకపోయినప్పటికీ, వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడూ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, నాడు ఆయన చేసిన సహాయాన్ని తాను ఎప్పటికీ మరువలేనని మహువా మోయిత్రా కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం టీఎంసీ పార్టీలో తీవ్ర అసమ్మతి రేగి, దాదాపు 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు పక్షాన ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలో మహువా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లోక్‌సభలో కూడా 20 మంది టీఎంసీ ఎంపీలు వేరే పార్టీలో విలీనమై బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో, మహువా మోయిత్రా పార్టీ మారబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాను టీఎంసీని వీడే ప్రసక్తే లేదని, మమతా బెనర్జీయే అసలైన తృణమూల్ అని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో, గతంలో పార్టీని వీడిన తిరుగుబాటుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ మారాలనుకుంటే శుభేందు అధికారి లాగా పారదర్శకంగా, ధైర్యంగా మారాలని, అంతేకానీ లోపల ఉంటూ గోతులు తవ్వకూడదని హితవు పలికారు. బీజేపీ క్రమశిక్షణ గల క్యాడర్ ఆధారిత పార్టీ అని, అది కేవలం ఒకే ఒక్క వ్యక్తిపై ఆధారపడి నడవదని చెబుతూనే, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మహువా తేల్చి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న మహువా, శుభేందుల పాత స్నేహం గురించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/-mahua-moitra-25-224044.html





