దూకుడు పెంచిన జనసేన.. పవన్ కు తోడుగా గళమెత్తుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు
Publish Date:Jun 23, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అటు ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటూనే, ఇటు పార్టీ అంతర్గత కార్యాచరణను కూడా ఆయనే ముందుకు తీసుకువెడుతున్నారు. దీంతో పవన్ వర్క్‌లోడ్‌తో పవన్ సతమతమవుతున్నారు. ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి, పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా వారిలో కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ క్లాస్ పీకడంతో జనసేన అగ్ర నేతలైన కందుల దుర్గేష్, పంతం నానాజీ వంటి వారు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. ప్రతిపక్షాల వ్యూహాత్మక విమర్శలను తిప్పికొట్టేందుకు మీడియా ముందుకు వచ్చి ప్రతి విమర్శలు చేస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ అంశంపై వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్రంగా ఖండించారు. ఈ సున్నితమైన అంశాన్ని వాడుకుని ఒక ప్రత్యేక సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్‌పై వ్యతిరేకత పెంచాలని చూస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టడం జనసేనకు అత్యంత అవసరంగా మారిందనడంలో సందేహం లేదు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలకు జనసేన నాయకుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కుల ప్రస్తావన లేకుండా, పవన్ కళ్యాణ్ ఒక్క సీటైనా గెలవగలరా అన్న అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ గా.. జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల దాటి బయట ఎక్కడైనా నిలబడి గెలిచే దమ్ముందా అని నిలదీశారు. సత్తా ఉంటే కాకినాడ రూరల్ నుంచి గెలిచి చూపాలని సవాల్ విసిరారు. జనసేన నాయకత్వం ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం ఆ పార్టీ కార్యకర్తలలో జోష్ ను నింపింది. జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఇదే జోష్ ముందుముందు కూడా కొనసాగాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/janasena-steps-up-the-aggression-25-223862.html





