వరంగల్ ఉప ఎన్నికలలో జగన్ ప్రచారం!!!
Publish Date:Nov 6, 2015
Advertisement
రాజకీయ పార్టీలు వివిధ సమస్యలపై పోరాడటం, ఎన్నికలలో పోటీ చేయడం, గెలిస్తే అధికారం చెప్పట్టడం అన్నీ చాలా సర్వసాధారణమయిన విషయాలు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉంటారు. సమైక్యాంద్ర కోసం పోరాడినా అనుమానించారు.. ఆ తరువాత భూసేకరణ, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసినా అనుమానంగా చూస్తారు. చివరికి ఎన్నికలలో పోటీ చేస్తున్నా అనుమానమే చాలా మందికి. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యలపైనే పోరాడుతున్నప్పటికీ ఆయన పోరాటంలో ఎప్పుడూ రెండవ కోణం కనిపిస్తుంటుంది. అందుకే ఆయన చిత్తశుద్ధిని చాలా మంది శంకిస్తుంటారు. పేరుకి ఓదార్పు యాత్రలు చేసేవారు కానీ అవి నూటికి నూరు శాతం అచ్చమయిన రాజకీయ యాత్రలే. భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన పోరాటం మొదలుపెట్టినప్పుడు, ఆయన తన పోరాటాలతో ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయకుండా నిలువరించగలిగి ఉండి ఉంటే, రాష్ట్రంలో యావత్ రైతాంగం ఆయనకు జేజేలు పలికి ఉండేది. కానీ రెండు రోజులు ధర్నా చేసి “భూములు పోయాయని మీరేమీ కంగారు పడకండి. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిని తిరిగి ఇచ్చేస్తాను,”అని చెప్పి తన పోరాటం యొక్క పరమార్ధం ఏమిటో ఆయనే స్వయంగా చెప్పుకొని అభాసుపాలయ్యారు. అలాగే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నప్పుడు ఆయన లక్ష్యం కేంద్రప్రభుత్వం మీద ఉండాలి కానీ ఆయన తన బద్ధ శత్రువయిన చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని పోరాడటంతో ఆయన పోరాటం ప్రత్యేక హోదా కోసం కాదని చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టి రాజకీయంగా దెబ్బ తీయడానికేనని ప్రజలు కూడా గుర్తించేలా వ్యవహరించారు. అంత ఉదృతంగా మొదలుపెట్టిన ఆ పోరాటం అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేసి దాని ఊసే ఎత్తడంలేదిప్పుడు.ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించగానే “తెలంగాణాలో ఉనికే చాటుకోవడానికి ఇష్టపడనప్పుడు ఇంకా ఎందుకు పోటీ చేస్తున్నట్లో...?” అని అందరూ ఆశ్చరయం వ్యక్తం చేసారు. కానీ ఎందుకు పోటీ చేస్తోందో అందరికీ తెలుసు కనుక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాజా సమాచారం ఏమిటంటే వైకాపా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్ తరపున ఈనెల 16వ తేదీ నుండి 20 వరకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయబోతున్నారు. జగన్ మళ్ళీ చాలా రోజుల తరువాత తెలంగాణా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఇంతకాలంగా తెరాసకు ఇబ్బంది కలిగించకూడదనే తెలంగాణాలో వైకాపాను ఒక డమ్మీ రాజకీయ పార్టీగా నడిపిస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో ఉంటున్నా ఏనాడు తెలంగాణా జిల్లాలో అడుగుపెట్టలేదు. పరామర్శ యాత్రలకి తన చెల్లెలు షర్మిలను పంపినా ఆమె కూడా తెరాస ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని విమర్శించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడి తిరిగి వచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే తెరాస ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను విమర్శించవలసి ఉంటుంది. మరి జగన్ ఆ పని చేస్తారా? విమర్శిస్తే దాని అర్ధం ఏమిటి? ఆయన చంద్రబాబు నాయుడుకి దగ్గరయినందుకు విమర్శిస్తున్నట్లా లేకపోతే ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు తెదేపా-బీజేపీ అభ్యర్ధికి పడకుండా తనవైపు తిప్పుకొని తద్వారా ఓట్లు చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయ పడేందుకా? చాలా అనుమానాలున్నాయి. ఇంతకీ ఆయన వెళతారో లేకపోతే కొత్త సమస్యలను ఆహ్వానించడం దేనికని ఆఖరు నిమిషంలో తన సోదరి షర్మిలను పంపిస్తారో?చూడాలి.
http://www.teluguone.com/news/content/-jagan-mohan-reddy-45-52118.html





