వైకాపాలో వలస పక్షుల బాధలు
Publish Date:May 4, 2013
Advertisement
వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైకాపా ఆవిర్భవించిన నాటి నుండి ఆ పార్టీలోకి వెళుతున్న వలస పక్షుల్ని గమనిస్తే మొట్టమొదటగా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ వైకాపా పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా వెళ్ళిన ఎం.పి. సబ్బం హరి, వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ అయిన కొణతాళ రామకృష్ణతో ఉన్న విభేదాల కారణంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ జైల్లో ఉన్న కారణంగా వాళ్ళ చిన్నాన్న వై.వి. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారు. జగన్ కి మొట్టమొదటి నుండి సపోర్టింగ్ గా ఉండి మంత్రి పదవిని కూడా వదులుకున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ లాంటి వారికి ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యత కనిపించడం లేదు. అటువంటప్పుడు కొత్తగా చేరేవారికి ఎటువంటి ప్రాధాన్యత, గౌరవం లభిస్తుందో చెప్పనవసరం లేదు. ఒకనాడు రాజశేఖర్ రెడ్డి తో సమాన స్థాయిలో కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ హోం మంత్రి మైసూర రెడ్డి లాంటి వారు రాజశేఖర రెడ్డి తో విభేదించి తెదేపా లో చేరి వైఎసార్ మరణానంతరం జగన్ పార్టీ లో చేరడం అంటే రాజకీయాల్లో పడిపోతున్న అధికార దాహానికి అద్దం పడుతుంది. ఆయనకు పార్టీలో సరైన గౌరవమర్యాదలు లభించక పార్టీలో ఇమడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు కారణం పార్టీని నడిపించడానికి కో ఆర్డినేటర్లను నియమించారు. దానిలో అనుభవం ఉన్నవారికి స్థానం లేదు. అనుభవం లేని వారిని కో ఆర్డినేటర్లు గా నియమించటం వలన మైసూరా రెడ్డి లాంటి సీనియర్ నేతలు చిన్నచూపుకు గురౌతున్నారు.
సినీనటి రోజా తెదేపాలో అత్యన్నత స్థానం అయిన మహిళా అధ్యక్షురాలిగా పనిచేసినప్పటికీ ఆమె అనుభవాన్ని సరిగా ఉపయోగించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపిచడం లేదు. జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంగా జైల్లో ఉన్న కారణంగా పార్టీని నడిపించే వారికి రాజకీయ అనుభవం లేదు.
దాడి వీరభద్రరావు వైకాపా లో చేరుతున్న కారణంగా ఆ పార్టీ కార్యకర్తల నుండి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత, పార్టీ సీనియర్లకు విలువ ఇవ్వని జగన్ వైఖరి వెరసి కొణతాల పార్టీ నుండి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుండి, తెదేపా నుండి వచ్చిన వారికి ఎంతవరకు సముచిత స్థానం లభిస్తుందో తెలుసుకుని దాడి లాంటి వారు వైకాపా లొకి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఎపుడో ఆ పార్టీ లోకి వెళ్ళిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాధించింది ఏమిటి?
వైకాపా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ రెహ్మాన్ స్థితి కుడా ఇంతకు మించి భిన్నంగా ఉన్నట్లు ఏమీ కనిపించటం లేదు. ఈ మొత్తం ప్రహసనం లో వివిధ పార్టీల నుండి వైకాపా లోకి వెళుతున్న వలస పక్షులకు దక్కుతున్నది ఏమిటి? (లేదా) వారు సాధించినది ఏమిటి? వారు ఎవరి కోసం ఈ గోడ దూకుళ్ళు మొదలు పెట్టారు?
మకు మర్యాదలు దక్కలేదని, తమ వ్యతిరేకులు పార్టీ లోకి వస్తే సహించలేనితనాలే కాని, నేడు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బాధలు ఎవరికీ పట్టవు. ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకోవటానికి కూడా వారి చరిష్మా సరిపోని నేతలు, ఈ రాజకీయాలు ఎవరిని ఉద్ధరించటానికి? కేవలం వారి ఉనికిని, వారి వ్యాపారాలను, వారి ఆస్తులను కాపాడుకోవటానికి తప్ప.
రాజకీయాల్లో ఆత్మ హత్యలే కాని, హత్యలుండవని ప్రతి నేతా మాట్లాడుతాడు. మరి ఇవాళ నైతికత, క్రమశిక్షణ, విలువలు అన్నింటిని వదిలేసి ఇలా పార్టీలు మారడం "హత్య లేక ఆత్మహత్య." ఏ పేరు పెడతారు? ఎందుకంటే ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని, ఆ పార్టీ నేతని నమ్మి ఎందరో నేతలు, కార్యకర్తలు, మేధావులు తమ ఆస్తులు అమ్ముకుని మరీ ఆ పార్టీ లోకి వెళ్ళారు. ఫలితం అందులో చాలా మంది తమ ఆస్తుల్ని పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఓక పార్టీ పెట్టగానే నేతలు ప్రస్తుతం ఉన్న పార్టీ లో తమకు సముచిత న్యాయం, సముచిత స్థానం దక్కట్లేదని ఆ కొత్త పార్టీ లోకి గుంపులు గుంపులుగా వెళ్లి చేరితే అక్కడ మాత్రం సముచిత న్యాయం , సముచిత స్థానం ఎలా దక్కుతాయి అనేది అనుభవజ్ఞులైన నేతలకు తెలియనిదా? (లేక) ఈ విషయాన్ని ప్రజలెవరూ గమనించట్లేదని వారి గుడ్డి నమ్మకమా? ఏది ఏమైనా కార్యకర్తలు పాటించే క్రమశిక్షణని నేతలు పాటించకపోవడం చాలా బాధాకరం. వోటర్లందరు రాజకీయ ప్రక్షాళన దిశగా వోటు హక్కును వినియోగించుకోవడం తమ కర్తవ్యం అని గుర్తెరగాలి.
http://www.teluguone.com/news/content/-jagan-mohan-reddy-39-22854.html





