డీజే మోతకు కూలిన స్లాబ్ పెచ్చులు.. నిద్రలో ఉన్న చిన్నారులకు తీవ్ర గాయాలు.!
Publish Date:Oct 23, 2026
Advertisement
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు కొనింటి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున శ్రీహరి తన భార్య పల్లవి, కుమారుడు మనస్తిత్, కూతుళ్లు వివేక, స్వాతితో కలిసి తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో వీధుల్లో మారుమోగిన భారీ డీజే సౌండ్ తీవ్రమైన ప్రకంపనలను సృష్టించింది. ఆ తీవ్రమైన శబ్ద తరంగాల ధాటికి దెబ్బతిన్న పాత ఇందిరమ్మ ఇల్లు ఒక్కసారిగా కదిలిపోయి, స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై పెచ్చులు పడటంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. కుమారుడు మనస్తిత్, కూతురు వివేకలకు తీవ్ర గాయాలు కాగా, శ్రీహరితో పాటు మిగతా కుటుంబ సభ్యులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ అనూహ్య ప్రమాదంతో ఇంట్లో ఒక్కసారిగా హాహాకారాలు చెలమెత్తాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను రక్షించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది. గ్రామాల్లో పండుగలు, ఉత్సవాల పేరిట రాత్రింబవళ్లు విపరీతమైన శబ్దాలతో మోగే డీజేల కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెవిలో హోరెత్తించే డీజేల ఏర్పాటుపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, ఇకపై ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పండుగలు, ఊరేగింపుల పేరుతో అధిక శబ్దంతో డీజేలు మోగించడం ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబ్ద కాలుష్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. [ DJ sound accident, Medak news, Peddakodur incident, slab collapse, Telangana news, DJ sound vibration injury, Telangana Police, DGP C.V.Anand, Devi navaratrulu, Telugu News, Telugu One ]
http://www.teluguone.com/news/content/-dj-sound-accident-25-235182.html





