బీడువారిన పొలాలు.. ఎండిన బావులు.. కరువు మిగిల్చే కన్నీటి కథలు.!
Publish Date:Oct 23, 2026
Advertisement
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది. రాబోయే 2027 నాటికి దేశంలో భయంకరమైన కరువు ముప్పు పొంచి ఉందన్న పర్యావరణ వేత్తల హెచ్చరికలు గుండెల్ని పిండేస్తున్నాయి. కేవలం వర్షాభావమే కాదు, సరైన ప్రణాళిక లేకపోవడం, జవాబుదారితనం లోపించడం వల్ల రాబోయే రోజుల్లో తాగునీటి కోసం, పూట గూడు కోసం జనం పడే పాట్లు తలచుకుంటేనే కన్నీళ్లు ఆగవు. నేడు పట్టణాల్లోనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో అపార్టుమెంట్లు నీళ్ల కోసం కటకటలాడుతున్న దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి వాస్తవ వేదిక కార్యక్రమంలో రాబోయే కరువు ముప్పుపై క్లుప్తంగా విశ్లేషణ చేశారు. ఇక రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితి, రైతుల దయనీయ స్థితి మరింత దారుణంగా మారనుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కృష్ణా, తుంగభద్ర, కావేరి నదుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతుండటంతో కరువు ఛాయలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సాగునీరు అందక అన్నదాత కన్నీరు మున్నీరు అవుతుంటే, మరోవైపు కూరగాయలు, బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకవైపు దేశంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకుంటున్నాయి. అంటే అర్థం ఏమిటి? దేశంలో సగానికి పైగా జనం పూట గడవక, తిండికి లేక అలమటిస్తున్నారనే కదా నగ్న సత్యం? ఎఫ్.సి.ఐ (FCI) గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు ఎలుకలపాలవుతున్నా, సరిగ్గా సరఫరా చేసే లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఒకచోట పండన పంటలు కుళ్లిపోతుంటే, మరోచోట ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. వరి పంట వేయొద్దంటున్న ప్రభుత్వాలు, ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వట్లేదు. పరిశోధనల పేరుతో కోట్లాది రూపాయలు విడుదలవుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగేదేమీ లేదు. పాలకుల ఉదాసీన వైఖరి, ప్రణాళికా లోపం వెరసి సామాన్యుడి జీవితాన్ని అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే.. అన్నం గింజ కోసం, గుక్కెడు నీళ్ల కోసం జరిగే అంతులేని క్షామం మనలను కబలించడం ఖాయం. [ 2027 drought, Krishna river water shortage, El Nino effect, FCI godowns, farmer problems, Telugu news, drinking water problem, agricultural crisis, food security, government negligence, Telugu One news ]
http://www.teluguone.com/news/content/-2027-drought-25-235188.html




