కార్పొరేట్ వర్క్ కల్చర్‌లో మత చిహ్నాల రచ్చ
Publish Date:Apr 23, 2026
Advertisement
ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్ కార్ట్ ( ఇటీవల ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన ఒక అంతర్గత శిక్షణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అది కాస్తా పెను వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఉద్యోగుల డ్రెస్ కోడ్‌లో కొన్ని మతపరమైన చిహ్నాలను అనుమతించి, మరికొన్నింటిని నిషేధించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అయిన ఆ స్టాఫ్ యూనిఫామ్ అండ్ గ్రూమింగ్ గైడ్ ప్రకారం.. పని ప్రదేశంలో ఉద్యోగులు నలుపు రంగు హిజాబ్ లేదా టర్బన్‌లను ధరించవచ్చనీ, అదే సమయంలో నుదుటిపై బొట్టు, తిలకం ధరించడం లేదా చేతికి రక్షాబంధనం (చేతి తాడు) వంటి దారాలను కట్టుకోవడం నిషేధమనీ ఆ పత్రంలో రాసి ఉండటం కలకలం రేపింది. అంతేకాకుండా.. వివాహిత మహిళలు పెట్టుకునే సిందూరం కూడా చాలా తక్కువగా ఉండాలని, అది కూడా నుదుటి మీద ఉండడానికి వీల్లేదనీ ఆంక్ష విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనలు బయటకు రావడంతో.. ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రచారంలో ఉన్న ఆ డాక్యుమెంట్ సంస్థ యొక్క ప్రస్తుత విధానాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. అది ఒక పాత ఇంటర్నల్ డాక్యుమెంట్ అని పేర్కొన్న ఆయన అందులో ఉన్న తప్పులను ఫిబ్రవరిలోనే గుర్తించి తొలగించామని వివరణ ఇచ్చారు. లెన్స్ కార్ట్ భారతీయుల కోసం నిర్మించబడిన సంస్థ అని, ఇక్కడ మతపరమైన వ్యక్తీకరణలపై, ముఖ్యంగా బొట్టు లేదా తిలకంపై ఎటువంటి ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే, సదరు డాక్యుమెంట్‌పై 2026 ఫిబ్రవరి తేదీ ఉండటంతో, సీఈఓ వివరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు కేవలం ప్రకటనల కోసమే డైవర్సిటీ అనే పదాన్ని వాడుతాయా లేక క్షేత్రస్థాయిలో ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాయా అనే చర్చ ఇప్పుడు న్యాయ, సామాజిక వర్గాల్లో మొదలైంది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు, కార్పొరేట్ కంపెనీల బ్రాండ్ రూల్స్‌కు మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఈ ఘటన మరోసారి చర్చను రేకెత్తించింది. భవిష్యత్తులో ఇటువంటి సున్నితమైన అంశాలలో కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వివక్షకు తావు లేకుండా అన్ని సంప్రదాయాలను సమానంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. - సీతారాం కంఠంనేని
http://www.teluguone.com/news/content/-controversy-over-religious-symbols-in-corporate-work-culture-36-218081.html





