సహజీవనం వద్దన్నందుకు... తల్లిదండ్రులు, చెల్లిని చంపేసింది!
Publish Date:Jun 23, 2026
Advertisement
సిలికాన్ సిటీలో ట్రిపుల్ మర్డర్ కలకలం.. బెంగళూరు నగరంలో అత్యంత నాగరిక సమాజం తలదించుకునేలా ఒక ఘోర కలియుగ వింత చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లి కాకుండానే సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్) చేస్తానన్న పెద్ద కూతురి నిర్ణయాన్ని అడ్డుకున్నందుకు.. కనిపెంచిన తల్లిదండ్రులను, రక్తసంబంధీకురాలైన చెల్లిని ఆ యువతే కిరాతకంగా అంతం చేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బెంగళూరులోని కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి, ధమానిక్ లేఅవుట్‌లో గల సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్ (55), ముత్తులక్ష్మి (48) దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కూతురు శ్వేతకు కెన్నెత్ అనే యువకుడితో సంబంధం ఉంది. అతనితో సహజీవనం చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే ఈ ఘోర హత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ దారుణం వెనుక కేవలం ప్రేమ వ్యవహారమే కాకుండా ఆర్థిక గొడవలు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితురాలైన శ్వేత బయట దాదాపు రూ. 30 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ అప్పుల విషయమై గత కొన్ని రోజులుగా ఇంట్లో తల్లిదండ్రులు ఆమెను నిలదీస్తుండటంతో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను వదిలించుకోవాలని శ్వేత, ఆమె ప్రియుడు పథకం పన్నారు. పథకం ప్రకారం.. సోమవారం శ్వేత, కెన్నెత్ లు ఇంటికి వచ్చే సమయానికి తల్లి ముత్తులక్ష్మి మాత్రమే ఒంటరిగా ఉంది. ఆ సమయంలో మరోసారి సహజీవనం, అప్పులపై పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన నిందితులు కత్తితో ముత్తులక్ష్మిపై దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా బాత్రూమ్‌లోని రక్తపు మరకలను కడిగేసి తదుపరి హత్యలకు వేచి చూశారు. కొద్దిసేపటికి చెల్లెలు సుప్రియ (20) ఇంటికి రాగానే శ్వేత గట్టిగా పట్టుకోగా.. కెన్నెత్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత చివరిగా తండ్రి సోమసుందర్ రాగానే ఆయనపై కూడా దాడికి తెగబడ్డారు. అయితే తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ రక్తం కారుతున్న స్థితిలోనే ప్రాణాలు కాపాడుకోవడానికి అపార్ట్‌మెంట్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి స్థానికులను సహాయం కోరారు. చివరకు ముగ్గురూ ప్రాణాలు కోల్పోగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హృదయవిదారక ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆకర్షణలు, విచ్చలవిడితనం కోసం కన్నవారిని, తోడబుట్టిన వారిని ఇంత క్రూరంగా చంపేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఈస్ట్ పాయింట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులైన శ్వేత, కెన్నెత్ పరారీలో ఉండటంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-bengaluru-triple-murder-36-223894.html





