కృష్ణాతీరంలో "ఫ్యాన్" కొట్టుకుపోబోతోంది..!
posted on May 12, 2016 4:31PM

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి రోజురోజుకి చిక్కిపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి మరికొన్ని షాక్‌లు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నమ్మినవారు..నా అనుకున్న వారు జగన్ తీరు నచ్చక వలసబాట పడుతున్నారు. రాజకీయాలకు రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రబిందువు అయిన కృష్ణాజిల్లా వైసీపీలో వలసల పరంపర మొదలయ్యాయి. సీనియర్ నాయకులు, వారి బంధువులు, మిత్రులు టీడీపీకి క్యూకడుతున్నారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సైకిలెక్కగా..ఆయన దారిలో జంప్ కొట్టేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావులు గోడ దూకడానికి మంతనాలు జరుపుతున్నారు.
వాస్తవానికి కృష్ణాజిల్లా అనగానే తెలుగుదేశానికి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటి ఇచ్చింది. ఒక సమయంలో పదిసీట్లకు పైగా వస్తాయని వైసీపీ అంచనా వేసింది. కానీ ఐదు స్థానాలతోనే సరిపెట్టుకుంది. జగన్‌కు ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలిచేందుకు అక్కడి నేతలు సహకరించడం లేదు. నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో విబేధించి వైసీపీలో చేరిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా సొంతగూటికి చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇక పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. ఆమె కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా తెలుగుదేశంలోకి వెళ్లాలనుకుంటున్నారు.
మైలవరం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌ను నమ్మి వైసీపీలో చేరినను జగన్ మాత్రం ఆశించిన స్థాయిలో అతనికి ప్రాధాన్యత ఇవ్వటంలేదనేది కార్యకర్తల అభిప్రాయం. రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ సంగతి చూస్తే దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగానూ, ప్రభుత్వంలోనూ కాపు నేతలు "కీ" రోల్ ప్లే చేస్తుండటంతో కాపు సామాజికవర్గంలో మాస్ ఇమేజ్ ఉన్న రాధాను టీడీపీలో చేర్చేందుకు కాపునేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి పార్థసారథి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సారథి పది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగారు. జిల్లాలో ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుగా హవా నడిచింది. ఇప్పుడదంతా గతం..ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పార్థసారథికి జగన్ అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తనను ప్రెస్ మీట్‌లకే పరిమితం చేసి విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం లేదనే బాధలో సారథి ఉన్నారు. అందుకే పార్టీ మారాలనుకుంటున్నారు. మొత్తం మీద జిల్లాలోని వైసీపీ ముఖ్య అనుచరగణమంతా పార్టీని వీడీ ఎప్పుడెప్పుడు పచ్చకండువా కప్పుకుందామా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మారుతున్న వారికి ఫుల్ పాపులారిటీ వస్తుండటంతో నేతలంతా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఇంత జరుగుతున్నాఅధినేత జగన్ నాయకుల కదలికలపై నిఘా పెట్టకపోవడం గమనార్హం. వీరిని కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కృష్ణా జిల్లాలో ఫ్యాను పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.