కేవీపీ బిల్లు అడ్డుకోవడానికి బీజేపీ వ్యూహం...!
posted on May 12, 2016 2:40PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రేపు ఓటింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు, రేపు జరిగే ఓటింగ్ "చావో రేవో" కిందే లెక్క. ఇప్పటికే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసిన దరిమిలా, కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖుంగా తెరపైకి తెచ్చింది. అందుకే ఈ ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. వ్యూహత్మకంగా రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్‌దే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై కేవీపీ బిల్లు చర్చకు వస్తే..ఆ తరువాత జరిగే ఓటింగ్‌లో సంఖ్యాబలం లేని బీజేపీ ఓటమిని ఒప్పుకోవాలి.
రాజ్యసభలో ఈ బిల్లు పాసైనా..లోక్‌సభలో బీజేపీ బలం ముందు కాంగ్రెస్ తలవంచక తప్పదు. కాని ఇక్కడే ఉంది కాంగ్రెస్ మైండ్ గేమ్..లోక్‌సభలోకి బిల్లు వస్తే దానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రధాని మోడీ స్వయంగా బిల్లుపై మాట్లాడాలి. హోదాకు మేం ఒప్పుకుంటున్నాం అంటే ఓకే..! అలా కాక ఇవ్వడం కుదరదు అంటే మాత్రం ఏపీలో బీజేపీ గల్లంతే. ఇప్పటి వరకు హోదా ఇవ్వడం సాధ్యపడదు అని తన మంత్రుల చేత చెప్పిస్తున్న మోడీ ఇంతవరకు దీనిపై అధికారికంగా మాట్లాడలేదు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడక తప్పదు. అప్పుడు మోడీ హోదాకు వ్యతిరేకమో..అనుకూలమో చెప్పాలి. దాని కోసమే కాంగ్రెస్ ప్లాన్. హోదా ఇచ్చినా కాంగ్రెస్‌కే ప్లస్..ఇవ్వకపోయినా కాంగ్రెస్‌కే ప్లస్. ఈ ప్లాన్‌ను అర్థం చేసుకున్న బీజేపీ అధినాయకత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
దీనిని ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచించిన బీజేపీ వ్యూహకర్తలు రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేయాలని వ్యూహన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే నిర్దేశిత సమయం కంటే రెండు రోజులు ముందుగానే లోక్‌సభను వాయిదా వేసిన కేంద్రం..ఓ రోజు ముందుగానే రాజ్యసభను వాయిదా వేయాలని స్కెచ్ గీస్తోంది. ఇవాళ రాజ్యసభ నిరవధిక వాయిదా పడితే..రేపు సభ ముందుకు రానున్న కేవీపీ బిల్లు..తదుపరి సమావేశాల్లో కాని సభలో ప్రస్తావనకు రాదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం నుంచి తప్పించుకునేందుకు నరేంద్రమోడీకి ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.
ఇప్పుడైతే తప్పించుకున్నారు అనుకుందాం.. కాని వచ్చే సమావేశాల్లో ఏం చేస్తారు అని మీకు డౌట్ రావొచ్చు. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది..ప్రస్తుతం రాజ్యసభలో 57 మంది సభ్యుల పదవీ కాలం రేపటితో ముగియనుంది. వారి స్థానంలో బీజేపీ తో పాటు ఎన్‌డీఏ మిత్రపక్షాలకు చెందిన పలువురు సభ్యులు ఎన్నికవుతారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలను బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలే పరిపాలిస్తున్నాయి. తద్వారా బీజేపీ బలం కూడా పెరగనుంది. రాజ్యసభలో తన బలం పెరిగిన తర్వాత జరగనున్న తదుపరి సమావేశాల ముందుకు ఈ బిల్లు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని కమలనాథుల భావన. దీనిని బట్టి బీజేపీ ఏ రకంగానూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయించకున్నట్లుంది.