బొత్స భుజాలపై నుంచి పేలుతున్న కొత్త జ‘గన్‘

బొత్స సత్యనారాయణకు ఓ లక్ష్యం ఉంది, దానిని చేరుకోవడానికి ఏ మార్గం ఎంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు, అందుకే మాజీ పీసీసీ అధ్యక్షుడి హోదాను సైత పక్కనబెట్టేసి వైసీపీలో చేరిపోయారు, తన రాజకీయ ఎదుగుదలకు ఏ పార్టీ సరైనదో ఎంచుకోవడంలో బొత్స దిట్ట, వైఎస్ కు నమ్మిన బంటుగా, ముఖ్య అనుచరుడిగా ఉంటూ రాజకీయంగా ఎదిగిన బొత్స... రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డాడంటే ఆయన ఎత్తుగడలు ఎలా ఉంటాయో అర్థంచేసుకోవచ్చు, సీఎం పీఠం దక్కకపోయినా, తన రాజకీయ చాణక్యంతో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టగలిగారు

బొత్స సత్యనారాయణకు ఉన్న తెలివితేటలను, విజయనగరం జిల్లాలో అతనికున్న పట్టు, రాజకీయ సామర్ధ్యాన్ని గమనించిన చంద్రబాబు... టీడీపీ అధికారంలో ఉండగా ఒకసారి పార్టీలోకి ఆహ్వానించారట, అయితే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన బొత్స బాబు ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారట, కాంగ్రెస్ ద్వారానే రాజకీయంగా ఎదగాలనుకున్న బొత్స... ఆ తర్వాత కాలంలో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదగలిగారు, తన కుటుంబంలో అందరికీ టికెట్లు ఇప్పించుకుని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా గెలిపించుకున్నారంటే విజయనగరం జిల్లాలో ఎంతగా పట్టుసాధించారో తెలుస్తుంది.

అయితే రాష్ట్ర విభజన విషయంలో బొత్స సత్యనారాయణ అంచనాలు తలకిందులయ్యాయి, తెలంగాణ ఇచ్చినా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరీ అంత దారుణంగా ఉండదని భావించారు, కానీ బొత్స లెక్క తప్పింది. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా గల్లంతయ్యింది, బొత్సకి తప్ప ఎవ్వరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు, దాంతో ఇక కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని గ్రహించిన బొత్స... వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు, ఇదేదో ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు, తన రాజకీయ భవిష్యత్ ను ముందుగానే ఊహించి వేగంగా తీసుకున్న నిర్ణయం,
మొదట్నుంచీ టీడీపీకి వ్యతిరేకి అయిన బొత్స... భవిష్యత్ వైసీపీదేనని గుర్తించి జగన్ చెంతకు చేరారు

అయితే జగన్ కూడా బొత్స సీనియారిటీని ఎలా వాడుకోవాలో అలా ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలను వైసీపీలోకి తీసుకొచ్చే కీలక బాధ్యతలను అప్పగించడంతోపాటు బొత్సను ముందుపెట్టి చంద్రబాబును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఇప్పటిరవకూ ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తూ... బొత్స భుజాల పైనుంచి జ‘గన్‘ పేల్చుతున్నారు. అదే సమయంలో బొత్సకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాపులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు, మరి జగన్ టార్గెట్ ను బొత్స రీచ్ అవుతారో లేదో చూడాలి.