అదే బాటలో యోగి సెకండ్ ఇన్నింగ్స్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన, యోగి ఆదిత్యనాథ్ సెకండ్ ఇన్నింగ్స్ 2.0 ఎలా ఉంటుంది? పరిపాలన పద్దతులలో, ప్రాధాన్యతలలో మార్పులు చేర్పులు ఉంటాయ? అంటే ఉండే అవకాశం లేదని యూపీ పొలిటికల్ పండిట్స్, గట్టిగా నొక్కి చెపుతున్నారు. విపక్షాలు ఎంతగా విమర్శలు చేసినా యోగి విధానాలకేజనం జై కొట్టారు. నలుగు పదుల రికార్డును బద్దలుకొట్టి వరసగా రెండవసారి బీజేపీని ఎన్నికలలో గెలిపించారు. యోగికి పట్టం కట్టారు.  

అదొకటి అలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి  అమిత్ షా అయినా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారేమో కానీ,యోగి ఆదిత్యనాథ్’ జాతీయవాద భావజాలం నుంచి ఒక్క అడుగు కాదు కదా, ఒక్క అంగుళం కూడా పక్కకు వేయరని ఆయన అడుగు జాడలను జాగ్రత్తగా గమనిస్తున్న, రాజకీయ విశ్లేషకులు, విశ్వాసంతో అంటున్న మాట. నిజానికి యోగి ఆదిత్య నాథ్ అయినా మరో  బీజేపీ నాయకుడే అయినా, హిందూ జాతీయవాదం, సుశాసన్ (సుపరిపాలన) అంత్యోదయ (నిరు పేదల సంక్షేమం) ఈ మూడే మూల సూత్రాలుగా బీజేపీ పాలన ఉంటుందని అంటారు.అలాగే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ఇదే బీజేపీ మూల మంత్రమని అంటారు. 

నిజానికి, గడచిన ఐదేళ్ళలో యోగి ఆదిత్యనాథ్ సుశాసన్’కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేవారు, ఎవరైనా, వారి కులగోత్రాలతో సంబంధం లేకుండా ఏరి పారేశారు. ఆ విధంగానే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరొచ్చింది. విపక్షాలు యోగిని నియంతగా, నరరూప రాక్షసునిగా చూపేందుకు  బుల్డోజర్ బాబా అని ఎద్దేవ చేసినా, ప్రజలు మాత్రం పాజిటివ్’గానే తీసుకున్నారు. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పేదలకు మేలు చేసేందుకు అమలు చేసిన, అంత్యోదయ సంక్షేమ పథకాల అమలుకు కూడా యోగి తొలి  ఐదేళ్ళలో పెద్దపీట వేశారు. 

ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ తొలి నిర్ణయం కూడా అదే సూచిస్తోంది.ముఖ్యమంత్రి యోగి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పలువురు విశ్లేషకులు, ఉచిత రేషన్’. బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని అంగీకరించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ సమావేశం అనంతరం ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజలకు చేరాలన్నారు. 

ఉచిత రేషన్ పథకాన్ని కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రారంభించారు. ఇది మార్చి నెలతో ముగియబోతోంది. తాజా నిర్ణయంతో మరో మూడు నెలలపాటు పేదలకు ఉపశమనం లభిస్తుంది. శాసన సభ ఎన్నికల్లో ఈ పథకంపై బాగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సో.. యోగి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఫిర్స్ ఇన్నిగ్స్’లో లానే సాగుతుందని, అందుకు ఇదే తార్కాణమని అంటున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu