టీ 100.. బియ్యం 290.. ఎగ్ 35.. శ్రీలంక దుస్థితే ఏపీకి పడుతుందా?
posted on Mar 26, 2022 6:21PM
"శ్రీలంక ఆర్థిక, ఆహార సంక్షోభానికి కారణం ప్రభుత్వ అసంబద్ధ, బాధ్యతారహిత్య ప్రజాకర్షక విధానాలే. అన్ని పేద దేశాలకు ఇది ఓ హెచ్చరిక లాంటిది. మనదేశంలోనూ చాలా రాష్ట్రాలు ఎన్నికల్లో లబ్దే పరమావధిగా అభివృద్ధిని విస్మరించి ఉచిత పథకాలను యథేచ్చగా అమలు చేస్తున్నాయి". --జయప్రకాశ్ నారాయణ.
జేపీ మాటలు వింటుంటే వణుకు పుడుతోంది. ఆయన హెచ్చరిస్తున్నది ఏపీ గురించే అనిపిస్తోంది. ఉచితాలు, సంక్షేమ పథకాలే శ్రీలంకలో సంక్షోభానికి కారణమని అంటున్నారు. ప్రస్తుతం లంక దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తీవ్ర ఆర్థిక ఆహార, సంక్షోభంలో కూరుకుపోయింది. టీ తాగాలంటే వంద. కేజీ బియ్యం కొనాలంటే 290. ఒక్క కోడిగుడ్డుకు రూ.35. కిలో ఉల్లి 200. లీటర్ పెట్రోల్ రూ.283, డీజిల్ రూ.220. ఇలా అన్ని ధరలు శ్రీలంకలో విపరీతంగా పెరిగిపోయాయి. శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు, కరోనా కష్టాలు.. ఈ ఆహార, ఆర్థిక సంక్షోభానికి కారణం.
ఇక, జేపీ వ్యాఖ్యలపై ఏపీలో చర్చ జరుగుతోంది. ఉచితాల పేరుతో ప్రజలకు పప్పూబెల్లాలు పంచుతూ.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీస్తున్నారనే విమర్శ ఉంది. అదే సమయంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, పెట్టుబడులు కానీ లేకపోవడంతో ఏపీ దివాళా అంచులకు చేరుతోందనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. రాబడి అంతా సంక్షేమ పథకాలకే ఖర్చై పోతోందని.. ఏదో ఒక పథకం పేరుతో.. ఓట్ల కోసం ప్రజలకు అడక్కుండానే డబ్బులు పంచేస్తూ.. అదే సంక్షేమం అన్నట్టు వైసీపీ సర్కారు గొప్పలకు పోతోందని.. కానీ, అది దీర్ఝకాలంలో రాష్ట్రాన్ని మరో శ్రీలంక మాదిరి మార్చేస్తుందని అంటున్నారు. కేవలం మద్యం రాబడి, అప్పులతో ఎన్నాళ్లు నెట్టుకొస్తారని నిలదీస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాజధాని కూడా లేని రాష్ట్రంగా మార్చి.. ఏపీని అథోగతి పాలు చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు.
సుమారు రెండు డజన్ల పథకాలతో.. దాదాపు 10 కోట్ల మంది లబ్దిదారుల జేబుల్లోకి ఏదో ఒక రూపంలో డబ్బులు వేస్తూ.. ఏపీని శ్రీలంకలా మారే స్థితిలోకి నెట్టేస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. పైగా ఆ పైసల పందేరాన్ని.. సంక్షేమ పథకాల క్యాలెండర్ పేరుతో ఘనంగా ప్రకటించుకోవడం విడ్డూరం.
వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం...
>>ఏప్రిల్‌లో- వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
>>మే- విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా
>>జూన్- అమ్మ ఒడి పథకం
>>జూలై- విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.
>>ఆగష్టు- విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్, నేతన్న నేస్తం.
>>సెప్టెంబర్- వైఎస్సార్ చేయూత
>>అక్టోబర్- వసతి దీవెన, రైతు భరోసా
>>నవంబర్- విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
>>డిసెంబర్- ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
>>జనవరి- రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు
>>ఫిబ్రవరి- విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
>>మార్చి- వసతి దీవెన.